AP Politics : ఏపీ రాజ‌కీయ పార్టీల ‘ట్యాగ్ లైన్స్’

రాజ‌కీయ పార్టీల ప్ర‌చారంలో `ఒక్క ఛాన్స్` అనే పదం జ‌గ‌న్ నుంచి మొద‌లై ఇప్పుడు ప‌వ‌న్ మీదుగా పాల్ వ‌ర‌కు చేరింది.

  • Written By:
  • Updated On - June 23, 2022 / 11:28 AM IST

రాజ‌కీయ పార్టీల ప్ర‌చారంలో `ఒక్క ఛాన్స్` అనే పదం జ‌గ‌న్ నుంచి మొద‌లై ఇప్పుడు ప‌వ‌న్ మీదుగా పాల్ వ‌ర‌కు చేరింది. ఆ ప‌దం ప్రకంపనలు సృష్టించిందా ? ఇంత చిన్న పదంకు ప‌నిచేస్తుందా? అని తరచి ఆలోచిస్తే దాని వెనక సెంటిమెంట్, మతం, కులం, వర్గం ఇలా ఒక్కోదాన్ని గ‌మ‌నించొచ్చు. ఆంధ్రా వాళ్లు అప‌ర మేధావుల‌ని తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి త‌రచూ వినిపించే మాట‌. కానీ, ఒక్క ఛాన్స్ ఇవ్వండ‌ని రాజ‌కీయ పార్టీలు అడ‌గ్గానే ఓటేస్తారా? అంటే 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు ఔన‌ని నిరూపించాయి. మ‌రో ఛాన్స్ అంటూ జ‌గ‌న్‌, ఒక్క ఛాన్స్ అంటూ ప‌వ‌న్, పాల్ వినిపిస్తున్నారు. అభివృద్ధి అంటూ చంద్రబాబు పాత మాటే చెబుతున్నారు. సెంటిమెంటి స్లోగ‌న్ కు ప్రాధాన్య‌త ఇస్తారా? అభివృద్ధికి వైపు చూస్తారా? అనేది హాట్ టాపిక్‌.

ఎన్నికలై మూడు సంవ‌త్స‌రాలు గ‌డిచింది. సీన్ క‌ట్ చేస్తే, ఏపీ దివాళా అంచుకు చేరింది. ఉత్తరాది పెత్త‌నం ఉన్న బీజేపీ పన్నాగంలో చిక్కుకుని రాష్ట్రం వివవిల లాడుతోంది . ఏ కోణం నుంచి చూసినా రాష్ట్రంలో బిజెపి , కాంగ్రెస్ బ‌ల‌ప‌డే అవకాశం లేదు. ఎ. పి లో 0. 80 శాతం బలం ఉన్న బిజెపి విడిగా పోటీ చేస్తే రాబోయే కాలంలో ఆ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది. బిజెపి కన్నా ఎక్కువ బలం ఉన్న జనసేనాని బిజెపి రోడ్ మాప్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతిపక్ష ఓటు చీలనీయను అన్న జనసేనాని మాటతో ఒక్కసారి రాజకీయ వేడి రగిలిస్తే అందరూ జనసేన , టిడిపి కలిసి పోటీచేస్తాయ‌ని అనుకుంటున్నారు. కానీ రోడ్ మాప్ కోసం ఎదురు చూస్తున్నా అంటే మరలా సందిగ్ధంలో ప‌డ్డారు జ‌న‌సేనాని.

TDP అగ్ర నాయకత్వం ఎక్కడా పొత్తుల గురించి తొందరపడి మాట్లాడడం లేదు. వేచి చూసే ధోరణిలో నాయకత్వం ఉంది. కార్యకర్తల్లో మాత్రం పొత్తు వద్దు అనే వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. దానికీ ఒక కారణం ఉంది. Tdp వచ్చిన తరువాత పార్టీ కార్యకర్తలు ఇప్పటిలా ఇబ్బంది ఎన్నడూ పడలేదు. వైసిపి అక్రమ కేసు లకు తాడో పేడో తేల్చుకుందాం అన్నంతగా విసిగి వేసారి ఉన్నారు. అదే స్వరాన్ని పార్టీ వేదికలపై వినిపిస్తున్నారు కూడా . మహానాడు తరువాత TDP ఊపు మీద ఉంది. అధికారం గడప వరకు వచ్చినట్లే అనే భావనలో ఉన్నారు. ఇది శుద్ధ తప్పు. అధికారం లేని కాలంలోనే Ycp నేత Tdp ని ఇరుకున పెట్టారు. ఇప్పుడు అధికారంలో ఉండి చూస్తూ ఊరుకుంటాడా ? బంగారపు పళ్లెం లో పెట్టి మరీ అధికారం అప్పజెప్పడానికి ఆయనేమైనా కోట్ల విజయ భాస్కర రెడ్డా ? సలహా దారుల బృందం అనుక్షణం దుర్భిణి వేసి కొత్త కొత్త జిమ్మిక్కులను అందిస్తుంది. మరోప్రక్క ఎన్ని కల వ్యూహకర్త Pk సమాజాన్ని కులాలు, మతాలుగా , వర్గాలుగా చీల్చి చెండాడేస్తాడు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ సంస్థాగ‌తంగా పోరాటాల‌కు దిగాలి. కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఆ పార్టీని ముందుకు వెళ్ల‌నివ్వ‌కుండా బ్రేకులు వేస్తున్నాయి. జిల్లాల్లో నాయకుల మద్య ఉన్న విభేదాలను చక్కదిద్ది, అలిగిన వారిని బుజ్జగింపులతో సరి చేసి వారిని కార్యోన్ముఖుల్ని చేయవల్సిన బాధ్యత పార్టీ నేత చంద్రబాబుది. తరువాత ఆ నాయకులు నియోజక వర్గ సభలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తే, మండల నాయకులు గ్రామ సభలు, బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తే దిగువశ్రేణి నాయకత్వం బలోపేతమై అప్పుడు ప్రతి కార్యకర్తా కదులుతాడు. ముందుగా Ycp వారు పెట్టించిన అక్రమ కేసులకు పార్టీ తరుపున న్యాయ సహాయం అందించాలి. కేసు పెట్టిన వెంట‌నే న్యాయవాది కార్య కర్తకు అందుబాటులోకి రావాలి. దానితో పార్టీ నా వెనక ఉంది అనే ధీమా కార్యకర్తకు కలిగి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు.

పవన్ చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర లాంటిది Tdp చెయ్యలేక పోవడం వ్యూహాత్మక తప్పిదం. పవన్ కు ఊన్న ఆర్ధిక స్తోమత Tdp కి లేదా ? ఇక్కడ పవన్ రైతుల్లో కూడా చీలిక తెచ్చే ఎత్తుగడను అనుసరిస్తూ కౌలు రైతుకు మాత్రం నిధిని సమకూరుస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. రైతులు Ycp, Tdp వైపు ఉంటారని వారు ఎలాగూ ఓట్లు వెయ్యరని కౌలు రైతు పేర నిధిని అందించడం ఓట్ల రాజకీయమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజిక ఓటర్లు Tdp హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లు, విదేశీ విద్య, సంక్షేమ నిధులను ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోందా? అనే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తు చేయ‌డంలేదు.

బిజెపి దిగువ శ్రేణి నాయకత్వం ఇక్కడ రాష్ట్ర Ycp ప్రభుత్వాన్ని తిడుతుంది. పై స్థాయిలో చట్టా పట్టా లేసుకుని తిరుగుతారు. విచిత్రం ఏమిటంటే ఉద్యోగుల మూల ధనాన్ని వాడుకుంటే ఉద్యోగ సంఘాలు, ఐ ఎ యస్ , ఐ పి యస్ లు మౌనం వహించడం. కమ్యూనిస్ట్ లు, జనసేన అధికారంలోకి ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు కాబట్టి ప్రభుత్వ అంతర్గత విషయాలు అంతగా ఆ పార్టీల‌కు తెలియవు. చాలా కాలం అధికారాన్ని అనుభ‌వించిన‌ Tdp కి ప్రభుత్వంలో జరిగే అవినీతిని వెలికి తీయడం పెద్ద కష్ఠమేమీ కాదు. ఇలాంటి అవినీతి విషయాలు కింది స్థాయి నాయకులతో మాట్లాడించ గుండా , నేరుగా చంద్రబాబు ఎండ గట్టాలి. ఎందుకంటే, Tdp అధికారం లోకి వస్తే అన్నిటి మీదా విచారణకు అదేశాలు ఇవ్వవలసింది ఆయనే కాబట్టి.

బస్సుయాత్ర కు శ్రీకారం చుట్ట డంతో కదలిక మొదలై అనూహ్య స్పంధన వస్తుంది. గత ఎన్నికల్లో రాయలసీమ వాసులు అత్యుత్సాహంతో అటు తెలంగాణాలో Trs కు, ఇక్కడ Ycp కు మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఇచ్చిన‌ప్ప‌టికీ నీటిపారుదల విషయం లో రాయలసీమ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు Kcr. ఎ.పి లో సాగునీటి విషయంలో దెబ్బతిన్నది రాయలసీమ వాసులే. తమ హక్కుల్ని కాలరాస్తున్న ఇద్దరు Cm లు చెట్టాపట్టాలుగా తిరుగుతూం టే, వారితో ఎడా పెడా చెంపదెబ్బలు తింటున్న సీమ వాసులు మౌనం వహిస్తున్నారు . Trs కొత్త వాదన చేస్తూ, పోలవరం వల్ల ఆంధ్రా వాసులకు నీటి లభ్యత వస్తుంది కాబట్టి మిగులు నీరు మాదే అనే వితండ వాదం చేస్తుంటే సీమ పౌరుషం ఏమైనట్లు? సీమ వాసులు Ycp కి భయపడుతున్నారా ? Ycp , Tdp అధినేతలు ఇద్దరూ రాయలసీమ వాసులే. Tdp పాలన గతంలో చూసారు. Ycp పాలన ఇప్పుడు చూస్తున్నారు. ఇలా ఎవ‌రి గేమ్ వాళ్లు ఆడుతూ `మ‌రో చాన్స్ `అంటూ జ‌గ‌న్ `ఒక్క ఛాన్స్` అంటూ ప‌వ‌న్, పాల్ లు ఏపీ ఓట‌ర్ల వ‌ద్ద‌కు రాబోతున్నారు. ఒక్క ఛాన్స్, మ‌రో ఛాన్స్ న‌డుమ అభివృద్ధి మంత్రాన్ని చంద్ర‌బాబు జ‌పిస్తున్నారు. వీటిలో ఏ సెంటిమెంట్ కు ఆంధ్రా ఓట‌ర్లు మొగ్గు చూపుతారో చూడాలి.