గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు!

ఏపీలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ప్రధానంగా ఏజెన్సీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది.దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దానిని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 11:03 AM IST

ఏపీలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ప్రధానంగా ఏజెన్సీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది.దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దానిని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. నర్సీపట్నం,అరకు,విజయనగరం జిల్లాల్లో గంజాయిని పండిస్తున్నారు.దీంతో పాటు సరిహద్దు ప్రాంతాలైన ఒడిశా నుంచి కూడా గంజాయి రవాణా జరుగుతుంది.అయితే దీనిని అరికట్టేందుకు ఏపీ పోలీసులు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి వ్యాపారాన్ని అరికట్టేందుకు ఏపీ పోలీసులు నడుంబిగించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల సహాయాన్ని కోరారు ఏపీ డీజీపీ గౌతంమ్ సవాంగ్.ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని జిల్లాల ఎస్పీలతో గంజాయి సాగు, వ్యాపార గమ్యస్థానాలు, నిషిద్ధ వస్తువుల వ్యాపారం మరియు రవాణాకు సంబంధించిన అంశాలతో సహా అక్రమ వ్యాపారాలకు సంబంధించిన వివిధ అంశాలను ఆయన సమీక్షించారు.

గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి ఎన్సిబి, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో సమన్వయ వ్యూహం సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహకారానికి అనుగుణంగా ఆయా ప్రభుత్వాల సహాయాన్ని కోరుతూ ఒడిశా, తెలంగాణలోని పోలీస్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు డీజీపీ తెలిపారు.

AOB ప్రాంతంలో ఒడిశా వైపు గంజాయి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉందని… ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా మూడు రాష్ట్రాల సరిహద్దుల వెంట నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో అభివృద్ధి చెందుతోందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని…అయితే, దాన్ని ఎదుర్కోవడానికి తమ విధానం ఈసారి ప్రత్యేకంగా ఉంటుందని డీజీపీ గౌతంమ్ సవాంగ్ తెలిపారు. గ్రేహౌండ్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) నుండి సహాయం తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 2.9 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందని… ఏఓబీ రీజియన్లో 4,500 ఎకరాలకు పైగా పంటను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి వ్యాపారాన్ని అరికట్టేందుకు తమ కొత్త వ్యూహంలో భాగంగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులను కూడా రంగంలోకి దించనున్నట్లు డీజీపీ తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు అక్రమ వ్యాపారానికి సంబంధించిన వివరాలను డీజీపీ సవాంగ్ అడిగి తెలుసుకున్నారు.