PRC Chalo Vijayawada : ‘చ‌లో విజ‌య‌వాడ‌`ఉద్యోగేతురుల‌పై మూడోక‌న్ను

ఉద్యోగుల `చ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మం ప‌ట్ల ప్ర‌భుత్వం మెత‌క వైఖ‌రిని అవ‌లంభిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 12:32 PM IST

ఉద్యోగుల `చ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మం ప‌ట్ల ప్ర‌భుత్వం మెత‌క వైఖ‌రిని అవ‌లంభిస్తోంది. నిఘా వ‌ర్గాల వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రెండు రోజులుగా పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ నిఘా పెట్టిన‌ప్ప‌టికీ విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు చేరుకున్నారు. రోడ్ల‌పైన పెద్ద సంఖ్య‌లో ఉద్యోగులు రావ‌డం వెనుక విప‌క్షాల కుట్ర ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు అనుబంధంగా ఉండే సంఘాల ఉద్యోగులు ఎక్కువ‌గా క‌నిపించారు. ఆ త‌రువాత తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే ఉద్యోగ సంఘాలు, సానుభూతిప‌రుల‌ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం నిఘా పెట్టింది. పోలీసులు వ్యూహానికి ప్ర‌తి వ్యూహాన్ని ర‌చించిన వైనాన్ని గ‌మ‌నిస్తే, ఈ కార్య‌క్ర‌మం వెనుక విప‌క్షాలు, అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఉద్య‌మ‌కారులు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం అనుమానిస్తోంది.ఇలాంటి ఉద్య‌మాలు జ‌రిగేట‌ప్పుడు ముందుగానే పోలీసులు ప్ర‌త్యేక‌మైన నిఘా పెడ‌తారు. నిఘా విభాగం ఇచ్చే స‌మాచారం ఆధారంగా పోలీసులు మోహ‌రిస్తారు. కానీ, ఈసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి పెద్ద కుట్ర జ‌రిగిన‌ట్టు నిఘా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం వేలాది మంది ఉద్యోగులు రోడ్ల‌పై ఉన్నారంటే..ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా ఏదో జ‌రుగుతోంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ గ్ర‌హించింది. అదుపు త‌ప్పి చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వాన్ని ఇరుక‌న‌పెట్టే అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త ప‌డుతోంది.

వాస్త‌వంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌ను ఆర్టీసీ కార్మిక సంఘాలు వ‌దిలేశాయి. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు `చ‌లో విజ‌య‌వాడ‌`కు దూరంగా ఉన్నారు. సామాజిక‌వ‌ర్గం, పార్టీ, సంఘాల వారీగా ఉద్యోగులు విడిపోయారు. ఈనెల ప‌డిన జీతాల‌ను చూసుకుని కొంద‌రు ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కుండా వెన‌క్కు త‌గ్గారు. కేవ‌లం ప‌రోక్షంగా కొన్ని పార్టీలు మ‌ద్ధ‌తు ఇస్తోన్న ఉద్యోగ సంఘాలు మాత్ర‌మే చ‌లో విజ‌య‌వాడ‌లో క‌నిపించార‌ని పోలీసులు గుర్తించారు. ముంద‌స్తుగా కొంద‌ర్ని అదుపులోకి తీసుకున్న‌ప్ప‌టికీ విజ‌య‌వాడ రోడ్ల‌పైకి వేలాది మంది వ‌చ్చారంటే..పోలీసుల వైఫ‌ల్యం క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది.కొత్త పీఆర్సీ రూపంలో ఉద్యోగుల‌కు జీతాలు పెరిగాయి. ఆ రూపంలో రాష్ట్రానికి 12వేల కోట్ల రూపాయ‌ల భారం ప‌డింది.దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వ‌నంత వాట ఏపీలో ఉద్యోగుల జీతాల‌కు వెళుతోంది. ఏపీ ప్ర‌జ‌ల నుంచి వివిధ ప‌న్నుల రూపంలో వ‌స్తోన్న‌ రెవెన్యూ సుమారు 63వేల కోట్ల రూపాయ‌లు ఉంది. ఉద్యోగుల‌కు జీతాల రూపంలో వెళుతోన్న మొత్తం రూ. 74వేల కోట్ల వ‌ర‌కు ఉంద‌ని బడ్జెట్ ను పరిశీలిస్తే అర్థం అవుతోంది. పైగా ఏపీ త‌ల‌స‌రి ఆదాయం ఒక ల‌క్షా 52వేల రూపాయ‌లు ఉంది. అదే, ఉద్యోగుల తల‌స‌రి ఆదాయం 8ల‌క్ష‌లా 30వేల వ‌ర‌కు ఉంది. ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం కంటే ఉద్యోగుల త‌ల‌స‌రి ఆదాయం ఆరు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. ఇలాంటిప‌రిస్థితుల్లో కూడా పీఆర్సీని జ‌గ‌న్ స‌ర్కార్ పెంచింది.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైన ఎంత ఉందో..విప‌క్షాల మీద కూడా అంతే ఉంది. కానీ, ఓట్ల రాజ‌కీయాల కోసం ఉద్యోగుల‌ను విప‌క్షాలు రెచ్చ‌గొడుతున్నారు. ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచే విధంగా గుడ్డిగా విప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని సామాజిక మేధావుల నుంచి ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. కేవ‌లం జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఉన్న ద్వేషంతో కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ఉద్యోగులు చేస్తోన్న పోరాటాల‌కు ఆజ్యం పోస్తున్నాయి. నేల‌విడిచి సాము చేస్తూ బాధ్య‌తారాహిత్యంగా మీడియాలోని కొంత భాగం కూడా ఏపీ రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తోంద‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు మ‌ద‌న‌ప‌డుతున్నారు. ఇదంతా చూస్తుంటే, ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌గ‌న్ సర్కార్ ను బ‌ద్నాంచేయ‌డానికి విప‌క్షాలు ప‌న్నిన కుట్రంగా ఉంద‌ని వైసీపీ భావిస్తోంది.ఇలాంటి పరిణామాలపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ గా ఉన్నాడు. పోలీసుల ఉదాసీన‌త‌పై కూడా కినుక వ‌హించాడు. లాఠీ చార్జి వ‌ర‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని ముందుగానే జ‌గ‌న్ సూచించాడ‌ని తెలుస్తోంది. అందుకే, పోలీసులు చూచిచూడ‌న‌ట్టు వ‌దిలేశారు. ఫ‌లితంగా విజ‌య‌వాడ రోడ్ల‌పై వేలాది మంది కనిపిస్తున్నారు. డ్రోన్ వీడియోల ద్వారా వాళ్ల‌లో ఎంద‌రు ఉద్యోగులు ఉన్నారు? ఎవ‌రి ఏ పార్టీ అనేది తేల్చ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతోంది. ఆ బండారం బ‌య‌ట‌ప‌డితేగానీ..ఉద్యోగుల `చ‌లో విజ‌య‌వాడ‌` వెనుక ఎవ‌రున్నారు అనేది తేల‌దు.