Site icon HashtagU Telugu

AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..

Ap Nominated Posts

Ap Nominated Posts

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించారు.

రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే అవకాశముందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం కష్టపడినవారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని నాయకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, చాలామంది టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం ఉంది. మిత్రపక్షాలతో కూడ చంద్రబాబు వివిధ చర్చలు కొనసాగిస్తున్నారు.

నామినేటెడ్ పదవుల్లో మిత్రపక్షాలకు 30 శాతం పదవులు కేటాయించాలనే అంగీకారం ఇప్పటికే కుదిరింది. ఈ మేరకు, రెండో దశలో పదవుల నియామకం జరుగబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. అలాగే, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను కూడా నియమించింది. ఇప్పటి వరకు ఏడు కార్పొరేషన్లలో 64 మందికి సభ్యత్వం కల్పించారు, మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతం ఛైర్మన్లను మాత్రమే ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన విధానాన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా వర్తింపజేశారు. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా నియమించారు. జనసేన నుంచి ముగ్గురు ఛైర్మన్లుగా, 9 మంది సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌ పోస్టు టీడీపీకి దక్కింది.

అశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొదటి విడతలో చాలా మంది నామినేటెడ్ పోస్టులను ఆశించారు, కానీ వారికి అవకాశాలు దక్కలేదు. అందువల్ల, రెండో విడతలో కనీసం తమకు అవకాశం రావాలని కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. విజయవాడ కేంద్రంగా లాబీయింగ్ ప్రారంభించారు. ఈ దఫా, కూటమి నేతల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే, కొత్తగా పార్టీలోకి చేరిన వారికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశముందని సమాచారం అందింది.