AP Cabinet: జ‌గ‌న్ న‌యా టీమ్.. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్..!

  • Written By:
  • Publish Date - April 4, 2022 / 03:27 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్రస్తుత మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవరుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది.

ఇక ఏప్రిల్ 7న ప్రస్తుత మంత్రివర్గ సభ్యులతో సీఎం జగన్ మోమ‌న్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలో భాగంగా ఎవరు మంత్రి వర్గంలో స్థానం కోల్పోతున్నారు, ప్రస్తుతమున్న మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే దానిపై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది, ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నాను అనే విషయాలపై 7న జరిగే మంత్రివర్గ భేటీలో జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో అదేరోజున తమ మంత్రి పదవులను కోల్పోయిన వారు, త‌మ రాజీనామా ప‌త్రాన్ని సీఎం జ‌గ‌న్‌కు ఇవ్వ‌నున్నారు. ఇక కొత్త మంత్రివ‌ర్గంలో స్థానం పొందిన వారికి ఏప్రిల్ 10న జ‌గ‌న్ స‌మాచారం ఇవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత మార్చి 11న మంత్రి వర్గ విస్తరణ, అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రాబోయేది ఎన్నికల కాలం కానుండటంతో మంత్రి వర్గంలో తీసుకొనేవారి విషయంలో సీఎం జగ‌న్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ప్రాంతాలు, జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప‌లు మీడియాల్లో జోరుగా వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, అండ్ ఎస్టీ సామాజిక వర్గాల వారికి, ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిగిలిన సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని వైసీపీ వ‌ర్గాలు భావిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ న‌యా మంత్రి వ‌ర్గంలోకి కొత్త‌గా ఎవ‌రికి చోటు ద‌క్కుతుందో, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవ‌రిపై వేటు ప‌డుతుందో తెలియాలంటే కొన్న రోజులు వెయిట్ చేయాల్సిందే.