NTR@100: ఏపీకి చంద్రబాబు విజన్ అవసరం: రజనీకాంత్

ఆంధ్రా దేశంలో నెంబర్ 1 గా నిలవాలి అంటే చంద్రబాబు విజన్ సాకారం కావాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 10:18 PM IST

NTR@100: ఆంధ్రా దేశంలో నెంబర్ 1 గా నిలవాలి అంటే చంద్రబాబు విజన్ సాకారం కావాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చంద్రబాబు విలువ ఏమిటో ఏపీ కంటే మిగిలిన ప్రాంతాల వారికి బాగా తెలుసన్నారు రజని. విజన్
2047 కు ఏమేమి అభివృద్ధి చెయ్యాలి అన్నదానిపై చంద్రబాబుకి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు అనుకున్న ప్లాన్ సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఉన్నత స్థానంలో ఉంటుందని రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు తరాల కోసం చేస్తున్న ఫ్యూచర్ ప్లాన్ ఖచ్చితంగా జరగాలని, ఎన్టీఆర్ ఆత్మ ఆయనకు సహకరించాలని, చంద్రబాబును ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననిఅన్నారు . ఎవరూ ఊహించని విధంగా 2020 విజన్ ను 1996లోనే చంద్రబాబు రచించారని కొనియాడారు. సైబరాబాద్ రూపంలో ఇప్పుడు అందరికి కనిపిస్తుందని అన్నారు. ముందు చూపు ఉన్న చంద్రబాబు మాత్రమే ఏపీని విజన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తారని అన్నారు.
ఆయనతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని రజని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబును కొనియాడిన రజినీకాంత్ ఐటీ విషయంలో ఏమి చేశారో, ఆయన ఘనత ఏమిటో ప్రపంచానికి తెలుసని పేర్కొన్నారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని, ఇప్పటికీ తన ప్రతి పుట్టిన రోజుకు, తాను ఎక్కడ ఉన్నా సరే చంద్రబాబు తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారన్నారు. కలుస్తాను అన్నా అపాయింట్మెంట్ ఇస్తారని పేర్కొన్నారు. చంద్రబాబును తనకు మోహన్ బాబు పరిచయం చేశాడని, అప్పుడే ఆయన గొప్ప నాయకుడు అని చెప్పాడని రజినీకాంత్ పేర్కొన్నారు. చంద్రబాబుకు దేశ రాజకీయాలు మాత్రమే కాదు ప్రపంచ రాజకీయాలు కూడా తెలుసు అన్నారు. చంద్రబాబు ఒక విజనరీ అని, దీర్ఘదర్శి అని రజినీకాంత్ కొనియాడారు. ఈరోజు లక్షల మంది ఐటీ ఉద్యోగులు సంతోషంగా బ్రతుకుతున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవాడలోని పోరంకిలో అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ స్వర్గీయ నందమూరి తారకరామారావు కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించారు.
నందమూరి తారకరామారావు యుగపురుషుడు అన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వెల్లడించారు. తన చిన్న వయస్సు నుండే, ఎన్టీఆర్ ప్రభావం ఉండేదని ఆయన పేర్కొన్నారు. తాను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి అని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన కోపిష్టి అని, కానీ ఆయన మనసు పాలలాంటిదని రజినీకాంత్ వెల్లడించారు.
ఎన్టీఆర్ కి వారసుడిగా బాలకృష్ణ తనదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారని, బాలకృష్ణ కంటిచూపుతోనే ఏదైనా చేయగలిగిన సమర్థుడని, బాలకృష్ణ చేసిన స్టంట్లు తాను కానీ, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలు కానీ చేయలేరని, చేసినా ప్రజలు ఒప్పుకోరని రజినీకాంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం హాజరు అయింది. భారత రత్న ఎన్టీఆర్ కు వచ్చే వరకు పోరాడుతానని చంద్రబాబు ఈ వేదికపై శపథం చేశారు.