Site icon HashtagU Telugu

Minister Roja: ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు.. ‘మూడేళ్ల తరువాత ప్రభుత్వంపై వ్యతిరేకత సహజం’

Mla Roja Jagan Cabinet

Mla Roja Jagan Cabinet

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ లో ఉన్న ఏ పార్టీకైనా సరే.. మూడేళ్ల పాలన తరువాత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత సహజమేనని అన్నారు. కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న రోజా మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఆమె ఒప్పుకున్నట్టు అయ్యింది. దీంతో వైసీపీ వర్గాలు రోజా మాటలకు ఖంగుతిన్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకతను సరిదిద్దుకోవడానికే గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకు వెళ్తున్నామన్నారు మంత్రి రోజా. ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో తొలిసారిగా ఆమె మచిలీపట్నం వెళ్లారు. అయితే గడప గడపకూ వైసీపీ కార్యక్రమం పేరు మారిస్తే బాగుంటుందన్నారు. ఈ పేరుకు బదులు.. గుండె గుండెలో జగనన్న పేరు పెట్టాలన్నారు. దీంతో అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉంటే అధిష్టానానికి చెప్పాలి కాని.. ఇక్కడెందుకు అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకున్నాయి.

గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఈ మూడేళ్లలో సర్కారు ఏం చేసిందో చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తారు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రజలు పొందిన ప్రయోజనాలను కూడా వివరిస్తారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. దానిని సరిదిద్దుకోవాలని సీఎం జగన్ కు సూచనలు అందినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. ఇక ఎక్కువకాలం సంక్షేమ పథకాలను కొనసాగించడం కష్టం. పైగా సర్కారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ప్రతీనెలా ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికల హింట్ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఈ నేపథ్యంలో మంత్రి రోజా అన్న మాటలు సంచలనానికి దారితీశాయి.