బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసే రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు పనులను వేగంగా కొనసాగించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సోమ, మంగళవారాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. గతనెల 25న కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రధాని కార్యాలయం నియమించిన కమిటీ రాష్ట్ర విభజన సమస్యలను సమీక్షించింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుపైనా ప్రత్యేకంగా సమీక్షను నిర్వహించింది.
ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆ సమావేశంలో ఏపీ కోరింది.అయితే, కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ తీర్మానించిన రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయమైనా పనులవారీగా కాకుండా ఒకే పద్దు కింద తీసుకుని తాము చేసిన పనులకు సంబంధించిన మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని అడిగేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై కేంద్రాన్ని అభ్యర్థించేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.