Site icon HashtagU Telugu

Minister Roja:నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో – మంత్రి రోజా

Minister Roja Chandrababu

Minister Roja Chandrababu

నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో అని అన్నారు మంత్రి రోజా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత చంద్రబాబులో వణుకు మొదలైందని అన్నారామె. అటు బాలకృష్ణ కూడా చంద్రబాబుని లైట్ తీసుకున్నారని, ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. హిందూపురంలో బాలకృష్ణ ప్రారంభించిన ఉచిత ఆరోగ్యరథంపై చంద్రబాబు ఫొటో కూడా లేదని, కేవలం ఎన్టీఆర్ ఫొటో, బాలకృష్ణ ఫొటో మాత్రమే ఉన్నాయని.. దాన్ని బట్టి చంద్రబాబుకి ఆయన ఇస్తున్న విలువేంటో అర్థమవుతుందని సెటైర్లు వేశారు. టీడీపీలో నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ వేర్వేరు అని అన్నారు రోజా.

కుప్పం కోట కూలడంతో బాబుకి పిచ్చి.. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోందని అన్నారు రోజా. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా నష్టపోయిందని, సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. అప్పుడు సంక్షోభం.. ఇప్పుడు సంక్షేమం..

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని, జగన్ జమానాలో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని చెప్పారు రోజా. సీఎం జగన్ ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం బటన్ నొక్కినా.. అదే రోజు ఏదో ఒక రాద్ధాంతం చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందని, నేతన్న నేస్తం విడుదల చేస్తున్న రోజు కావాలనే కుప్పంలో రగడ చేశారని చెప్పారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఓ వీడియోని అడ్డు పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేసిందని, ఇప్పుడు కుప్పంలో అల్లర్లు సృష్టించి వైసీపీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రోజా.

Exit mobile version