Site icon HashtagU Telugu

AP Caste Politics: మాజీ మంత్రి పేర్ని `కాపు` క‌ల‌హం!

Pawan

Pawan

`నికార్సైన కాపు నేను, క‌ల్తీలేని కాపును. వైసీపీలోని కాపు ఎమ్యెల్యేల‌పై బూతులు తిడ‌తావా. నిజ‌మైన కాపులం మేం. వంద‌కు వంద‌శాతం కాపులం.` ఇదీ మాజీ మంత్రి పేర్ని నాని మంగ‌ళ‌వారం జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఇచ్చిన కౌంట‌ర్ లోని హైలెట్ పాయింట్‌. అంటే నిజ‌మైన కాపు ప‌వ‌న్ కాద‌నే సంకేతం బ‌లంగా ఇచ్చే ప్ర‌య‌త్నం ప‌రోక్షంగా పేర్ని నాని చేశారు. నువ్వు అస‌లు కాపువేనా అంటూ ప‌వ‌న్ ను ప‌లు సంద‌ర్భాల్లో పేర్ని నాని నిల‌దీసిన సంద‌ర్భాలు గ‌తంలోనూ లేక‌పోలేదు.

వాస్త‌వానికి కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు వేర్వేరు. అప్ప‌ట్లో వంగ‌వీటి రంగా వ్యూహాత్మ‌కంగా కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను క‌లుపుతూ రాజ‌కీయాల‌ను న‌డిపారు. అదే పంథా కొన‌సాగుతోంది. అప్పుడ‌ప్పుడు ఎవ‌రు కాపు? అనే వాద‌న బ‌య‌ట‌కు వ‌స్తుంది. తెలుగు సినిమా రంగంలో ఒకానొక సంద‌ర్భంగా స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావు, మెగా కుటుంబీకుల మ‌ధ్య `కాపు` వివాదం న‌డిచింది. నిజ‌మైన `కాపు` దాస‌రి అంటూ అప్ప‌ట్లో టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రిగింది. ప‌రోక్షంగా మెగా కుటుంబీకులు కాపు కాదంటూ `బ‌లిజ‌`లోని ఒక తెగ అంటూ ఆనాడు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌కీయ రంగంలో `కాపు` వ్య‌వ‌హారం న‌లుగుతోంది.

కృష్ణా, గోదావ‌రి జిల్లాలో `కాపు` సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ‌గా `బ‌లిజ‌` సామాజిక‌వ‌ర్గం ఉంటుంది. అయితే, సామాజిక బ‌లం కోసం కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌న్నీ ఒక‌టే అనే నినాదం తొలుత స్వ‌ర్గీయ వంగవీటి రంగా తీసుకొచ్చారు. ఆ నినాదం ఆయ‌న్ను సామాజికంగా ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. మిగిలిన సామాజిక‌వ‌ర్గాల్లో ఉన్న‌ట్టే బ‌లిజల్లో ప‌లు ఉప కులాలు ఉన్నాయి. కానీ, కాపులో ఉప కులాలు లేవ‌ని అప్ప‌ట్లో టాలీవుడ్ కేంద్రంగా స్వ‌ర్గీయ దాస‌రి వ‌ర్సెస్ మెగా సామాజిక‌వ‌ర్గాల మ‌ధ్య న‌డిచిన వాద‌న సంద‌ర్భంగా కొంద‌రు వినిపించారు.

తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని నిజ‌మైన కాపులం మేము అంటూ జ‌న‌సేనానిపై ధ్వ‌జ‌మెత్తారు. అంటే ప‌రోక్షంగా నిజ‌మైన `కాపు` కాదంటూ ప‌వ‌న్ మీద ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు, కాపుల మీద ప్రేమ ఉంటే ఆనాడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంట్లో వాళ్ల కుటుంబీకుల‌పై వ్య‌క్తితత్త్వ హ‌న‌నం జ‌రుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావంటూ నిల‌దీశారు. ఇక్క‌డే నువ్వు నిజ‌మైన `కాపు` కాదంటూ తేలిపోతుంద‌ని పేర్ని దుమ్మెత్తిపోయ‌డం గ‌మ‌నార్హం.

మొత్తం మీద రెండు ద‌శాబ్దాల క్రితం టాలీవుడ్ లో వినిపించిన కాపు సామాజిక‌వ‌ర్గం ఎవ‌రు? అనే అంశం మ‌ళ్లీ ఇప్పుడు రాజ‌కీయ రంగంపైకి మాజీ మంత్రి పేర్ని నాని తీసుకొచ్చారు. దీంతో ఎవ‌రు కాపు? ఎవ‌రు బ‌లిజ‌? ఎవ‌రు తెల‌గ‌? అనే అంశం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది. కాపుల‌తో ఎలాంటి సంబంధం ప‌వ‌న్ కు లేద‌నే కోణాన్ని వైసీపీ తీయ‌డానికి రంగం సిద్దం చేసింది. ఆయ‌న బ‌లిజ సామాజిక‌వ‌ర్గంలోని ఒక తెగ అంటూ వినిపించేందుకు ఆధారాల‌ను సేక‌రిస్తోంద‌ని తెలుస్తోంది. ఇలాంటి సామాజిక వ‌ర్గం గొడ‌వ‌లు ఎటు దారితీస్తాయో చూడాలి.