AP Minister Jogi Ramesh: 175 నియోజకవర్గాల్లో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదు మంత్రి జోగి రమేష్ విమర్శ

చంద్రబాబుపై కుప్పంలో మొదలైన తిరుగుబాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ హెచ్చరించారు.

  • Written By:
  • Updated On - August 28, 2022 / 04:51 PM IST

చంద్రబాబుపై కుప్పంలో మొదలైన తిరుగుబాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, ఏ వర్గానికైనా, ఏ కులానికైనా మేలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. 33ఏళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసి, 45ఏళ్లపాటు కేబినెట్‌ ర్యాంకులో వివిధ పదవులు నిర్వహించిన చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని ప్రశ్నించారు. తమకు ఏం చేశారని అక్కడ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వల్లే చంద్రబాబు నాయుడును నిలదీస్తున్నారన్నారు. చంద్రబాబుపై తిరుగుబాటు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలైందని చెప్పారు. మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీల నుంచే తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. టీడీపీ జెండాను రాష్ట్రం నుంచి పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు.

కుప్పం నుంచే 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ విజయ దుందుభిమోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే జగన్మోహన్‌ రెడ్డి అర్హత ఉన్న ప్రతి గడపకూ అమ్మ ఒడి, చేయూత,ఆసరా, రైతు భరోసాతో పాటు ప్రతి నెలా ఠంఛన్‌గా పెన్షన్‌ పంపిస్తున్నారని చెప్పారు. ప్రతి గడపకూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారన్నారు. ప్రతి గడపకూ వచ్చి తాను ఫలానా పథకం అమలు చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు నాయుడుకు ఏదీ లేకుండా పోయిందని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరగడానికి వీల్లేదని బీసీలందరూ కంకణం కట్టుకున్నారని చెప్పారు. తమ ఓట్లను దండుకుని తమకు సున్నం పెట్టాడని అన్నివర్గాలవారు చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నమనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని జోగి రమేష్ కొనియాడారు.

కేఏ పాల్ కు, పవన్ కల్యాణ్ కు తేడా లేదు జనసేనను తన పార్టీలో విలీనం చేయమని పవన్‌కల్యాణ్‌కు కేఏపాల్‌ ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు. కేఏపాల్‌కు పవన్‌ కల్యాణ్‌ కు వ్యత్యాసం లేదన్నారు. ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవని ఎద్దేవా చేశారు 175స్థానాల్లో పోటీ చేస్తావా లేదా అని పవన్ ని అడిగితే సమాధానం ఉండదన్నారు. చంద్రబాబును మోస్తానని చెబుతాడని విమర్శించారు.