ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడ్డి క్యాబినెట్ లోని మంత్రి గుమ్మనూరు జయరాం `భూదాహం` బయటపడింది. ఒకేరోజు 180 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించడంతో ఆయన భాగోతాన్ని ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ) కనిపెట్టింది. ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు 180 ఎకరాల భూమిని సీజ్ చేసింది. గతంలోనూ భూ వివాదాల్లో మంత్రి జయరాం ఉండడం గమనార్హం.
కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఐటీ నోటీసులు జారీ చేసింది. సుమారు రూ.52.42 లక్షల విలువైన కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపలేదని నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన భార్య రేణుకమ్మకు నోటీసులు అందాయి. బినామీ చట్టం కింద ఈ నోటీసులు జారీ కావడం మంత్రి జయరాం భూదాహం ఏపీలో మారుమ్రోగుతోంది.
ఒకరోజు జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్ట్రర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఆ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలు రిజిస్ట్రర్ అయింది. మిగిలిన భూమి మంత్రి బినామీల మీద రిజిస్ట్రర్ అయిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే.. 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా ఈ భూ కొనుగోళ్లకు సంబంధించిన ఆదాయ మార్గాల ఎక్కడ నుంచి వచ్చాయో వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
గతంలోనూ ఇలాంటి భూముల వివాదంలో మంత్రి జయరాం చిక్కుకున్నారు. ఇతినా ప్లాంటేషన్స్ సంస్థకు చెందిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆ సంస్థ డైరెక్టర్ మనో బెంగళూరులో కేసు పెట్టారు. ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరారు. ప్రతిగా మనోపై మంత్రి సతీమణి రేణుకమ్మ, వారి బంధువు ఆస్పరి పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వివాదం నడుస్తుండగా ప్రస్తుతం 180 ఎకరాల రిజిస్ట్రేషన్ ఒకే రోజు చేయించుకున్న దందా బయటకు వచ్చింది. ఒకే దఫా భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారంటూ తన సతీమణి రేణుకమ్మకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా స్పందించారు. తన సతీమణికి ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన తెలిపారు.