వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.44 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, అమలు తక్కువ అని విమర్శించారు. ప్రభుత్వం ప్రతి పేదవాడికీ అవసరమైన సంక్షేమ పథకాలను తలుపుతట్టి మరీ అందిస్తున్నప్పుడు, చంద్రబాబు రోడ్లపై పెడుతున్న అన్న క్యాంటీన్లకు ఎవరు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అందులో ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేశారని చెప్పారు. రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఎన్నో హామీలను ఇచ్చినా, వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను కాగితాలకే పరిమితం చేసి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
అక్టోబరు 1 నుంచి తమ ప్రభుత్వం అమలు చేయబోయే కళ్యాణమస్తు, షాదీతోఫాల ద్వారా గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు భూములు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు అంటరానితనానికి, అట్రాసిటీకి నిదర్శనం అని నాగార్జున నిప్పులు చెరిగారు.