AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ( AP Mega DSC) దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. ఈ అభ్యర్థుల నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు వచ్చాయి. చాలామంది అభ్యర్థులు ఒకేసారి ఎస్జీటీ (SGT), స్కూల్ అసిస్టెంట్ (School Assistant), పీజీటీ (PGT) పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువైంది.
దరఖాస్తుల తుది గణాంకాలు ఇంకా తేలాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. డీఎస్సీని నిరవధికంగా, ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ధృడ నిశ్చయం చేసుకుంది. జూన్ 6 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.
అయితే చాలామంది అభ్యర్థులు కనీసం 90 రోజుల పాటు పరీక్షలకు సన్నద్ధం కావడానికి గడువు కావాలని కోరుతున్నారు. మెగా డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి నిరుద్యోగులు ఈ డిమాండ్‌ను చెబుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాకపోయినా, తాజాగా నారా లోకేష్ స్పందించారు. మెగా డీఎస్సీని ఆపేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కొన్ని వర్గాలు గడువు పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే డిసెంబర్‌లోనే సిలబస్ విడుదల చేసినందున, అప్పటి నుంచి ఇప్పటికి ఏడు నెలలు పూర్తయినట్లు గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలతో మెగా డీఎస్సీ గడువు పొడగింపు ఉండదని స్పష్టత వచ్చింది. ఈసారి ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుండటంతో, డీఎస్సీపై అభ్యర్థుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. పోటీ తీవ్రమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.