Site icon HashtagU Telugu

AP Liquor Scam: ‘మ్యూల్‌ ఖాతా’లతో లిక్కర్ మాఫియా దొంగాట!

Ap Liquor Scam Mule Accounts Liquor Bribes Ysrcp Govt Liquor Mafia

AP Liquor Scam: వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంతో ముడిపడిన చిట్టాను ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విప్పుతోంది. ఈక్రమంలో చాలా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ సప్లై కంపెనీలు, డిస్టిల్లరీల నుంచి లిక్కర్ మాఫియాకు నగదు, బంగారం రూపంలో ముడుపులు అందాయి. అయితే అవి నేరుగా అందలేదు. ఎవరికీ డౌట్ రాకుండా ఉండేందుకు.. వివిధ అడ్డదారుల మీదుగా లిక్కర్ మాఫియా చేతికి ముడుపులు చేరాయి. ఇందుకోసం మ్యూల్ అకౌంట్లను వాడుకున్నట్లు సిట్ గుర్తించింది.

Also Read :Education Loan: ఎల్ఎల్‌బీ చ‌ద‌వాల‌ని చూస్తున్నారా? అయితే రూ. 7 ల‌క్ష‌ల రుణం పొందండిలా!

ఏమిటీ.. మ్యూల్ ఖాతా ?

సైబర్‌ నేరగాళ్లు, ఆర్థిక అక్రమాలకు పాల్పడేవాళ్లు మ్యూల్ ఖాతాల్ని(AP Liquor Scam) వాడుతుంటారు. తాము అక్రమంగా కూడగట్టిన సొమ్మును సీక్రెట్‌గా మ్యూల్ ఖాతాల్లోకి పంపుతుంటారు. ఇతరులకు డబ్బు ఇస్తామనే ఆశ చూపించి.. వారి ఐడీ ప్రూఫ్‌లను తీసుకొని బ్యాంకు ఖాతాను తెరుస్తారు. ఆయా ఖాతాల్లోకి అక్రమ నిధులను పంపి దాచుకుంటారు. తమ పేరిట బ్యాంకుల్లో నిధులు కనిపించకుండా చేయడానికి వాడుకునే ఖాతాలు అయినందున వీటికి మ్యూల్ ఖాతాలు అనే పేరొచ్చింది. ఏపీ లిక్కర్ స్కాంలోనూ ఈ తరహా మ్యూల్ ఖాతాలను ముడుపుల బదిలీకి వాడుకున్నారట. ఇలాంటి మ్యూల్ ఖాతాలను అందించే అనేక ముఠాలు ముంబై, ఢిల్లీలలో ఉన్నాయి.  వైఎస్సార్  సీపీ హయాంలో లిక్కర్ మాఫియా ఈ ఖాతాలను తెగ వాడుకుందని సిట్ గుర్తించింది. రోజు కూలీలు, నిరుపేదలు, చిరు వ్యాపారులకు కొంత డబ్బు ఇస్తామంటూ ప్రలోభపెట్టి వారి గుర్తింపు కార్డులతో  పలు బ్యాంకుల్లో ఖాతాలను తెరిపించారు.  వారినే డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక డొల్ల కంపెనీలను క్రియేట్ చేశారు. లిక్కర్ సప్లై కంపెనీలు, డిస్టిలరీలు పంపిన ముడుపుల డబ్బుల్లో  కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లో వేశారు. తదుపరిగా ఆ ఖాతాల నుంచి డబ్బులను.. సదరు వ్యక్తుల పేరిట క్రియేట్ చేసిన డొల్ల కంపెనీలను దారి మళ్లించారు. అక్కడి నుంచి డబ్బు ఆనాటి ప్రభుత్వ పెద్దలకు చేరిందని సిట్ అధికారులు తెలిపారు.

Also Read :Temple Mystery: అమావాస్య, పౌర్ణమికి రంగులు మారే శివలింగం.. ఇప్పటికి మిస్టరీనే.. ఎక్కడో తెలుసా?

ఇవిగో ఆధారాలు.. 

వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము ముంబై అడ్రస్‌తో ఉన్న క్రిపటి ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.30 కోట్లు, ఓల్విక్‌ మల్టీవెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.30 కోట్లు, నైస్న మల్టీవెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.10 కోట్లు, విశాల్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.4 కోట్లు  చేరింది. ఆ కంపెనీల నుంచి కెరాజ్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, న్యూ మౌంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్, ట్రైఫెర్‌ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మలిష్క గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్, విక్సో ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, యష్‌ బులియన్‌ వంటి కంపెనీలకు డబ్బును మళ్లించారు. ఇవన్నీ ముంబై, ఢిల్లీ అడ్రస్‌తో ఉన్నాయి. ఈ డబ్బులో ఎక్కువ భాగాన్ని విదేశాలకు పంపారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.