Site icon HashtagU Telugu

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నోటీసులు

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖలలో ఒకటైన ఎక్సైజ్ విభాగంలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఈ శుక్రవారం హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ కేసు చుట్టూ నెలకొన్న ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వ కాలంలో మద్యం కొనుగోలు, సరఫరా, ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈ వ్యవహారంలో ప్రైవేట్ సిండికేట్‌లతో ప్రభుత్వం బంధాలు ఏర్పరచుకుని వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించిందని ఆరోపణలున్నాయి. ఈ అంశాలన్నింటినీ తేల్చేందుకు సిట్ ఆరా తీస్తోంది.

PM Modi: ప్ర‌ధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవ‌త్స‌రాల‌లో 27వ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు!

అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రజత్ భార్గవ పాత్రపై దృష్టి సారించిన సిట్, ఆయన సేవల సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ కోరనుంది. అనుమానాస్పద ఒప్పందాలు, టెండర్లు, ధరల నిర్ణయం తదితర విషయాలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

సీనియర్ బ్యూరోక్రాట్ అయిన రజత్ భార్గవ ఇటీవలే పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. తన కార్యనిర్వహణ కాలంలో ఎక్సైజ్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖల వంటి కీలక విభాగాల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు నోటీసులు జారీ చేయడంతో, ఇప్పటివరకు ఉన్న రాజకీయ, కార్యనిర్వాహక స్థాయిలోని దర్యాప్తు మరింత లోతుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను, సంబంధిత వ్యక్తులను సిట్ విచారించి, కొందరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపై మరిన్ని కీలకులపై విచారణ జరగనుందని సమాచారం. ఈ కేసు మరింత ఊహించని మలుపులు తిరగనున్నాయని అధికారులు అంటున్నారు.

Shivling Puja: గర్భధారణ స‌మ‌యంలో శివుడ్ని పూజించ‌డ‌టం వ‌ల్ల‌ లాభాలు ఉన్నాయా?