AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అరెస్టయ్యారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారుల పేర్లు కూడా ఈ కేసులో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ స్కామ్‌లో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.
లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కేసుకు సంబంధించిన వివరాలపై నారాయణస్వామిని ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది.
అయితే, నారాయణస్వామి సిట్ విచారణకు హాజరు కాలేనని ముందుగానే సమాచారం ఇచ్చారు. అనారోగ్యం , వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు రావడం సాధ్యం కాదని అధికారులకు తెలియజేశారు. దీనిపై సిట్ అధికారులు తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నారు. మరోసారి నారాయణస్వామికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ స్కామ్‌లో పేర్లు వెలువడిన ప్రతి రాజకీయ నేతపై దృష్టి సారించిన సిట్, ఆధారాలు సేకరించేందుకు క్షుణ్నంగా విచారణ జరుపుతోంది.
ఇప్పటికే ఈ కేసులో పలువురు వ్యాపారవేత్తలు, ఎక్సైజ్ శాఖ అధికారులను విచారించిన సిట్, త్వరలో మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. నారాయణస్వామి విచారణకు హాజరవడం లేదా ఆయనపై ఉన్న ఆరోపణలపై స్పందించడం కేసు దిశను మరింత స్పష్టంగా చేస్తుంది.