AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (సోమవారం) ఏసీబీ కోర్టు మంజూరు చేసిన అనుమతుల మేరకు, ఈరోజు ఉదయం ఇద్దరినీ సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు రోజుల పాటు సిట్ అధికారులకు విచారణకు అవకాశం ఉంది.
కస్టడీకి తీసుకుంటున్న సమయంలో చెవిరెడ్డి జైలు గేటు వద్ద మరోసారి హల్‌చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఒక రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు… తరువాత ఎవ్వరినీ వదిలేది లేదు,” అంటూ పోలీసు వాహనంలో ఎక్కారు.
ఈ కేసులో చెవిరెడ్డి ఏ-38 నిందితుడిగా, వెంకటేష్ నాయుడు ఏ-34 నిందితుడిగా ఉన్నారు. సిట్ మొత్తం ఐదు రోజుల కస్టడీ కోరినప్పటికీ, కోర్టు కేవలం మూడు రోజులే మంజూరు చేసింది. అంతేకాదు, చెవిరెడ్డి అభ్యర్థించిన విధంగా జైలు పరిధిలోని దేవాలయ దర్శనానికి పది నిమిషాల అనుమతి ఇచ్చినప్పటికీ, బయటి ఆహారం అనుమతించడాన్ని న్యాయస్థానం తిరస్కరించింది.