Site icon HashtagU Telugu

AP Liquor: ఏపీలో మద్యం నిర్వాహుకులకి ప్రభుత్వం షాక్!

Ap Liquor

Ap Liquor

AP Liquor: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధించాలి అని ఆదేశాలు జారీ చేసారు. ఈ ఉల్లంఘన రెండోసారి జరిగితే లైసెన్స్‌ రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో మద్యం, ఇసుక పై ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్రంలో బెల్టు షాపులు ఉండవద్దని స్పష్టం చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాలకు కూడా మొదటిసారి ఉల్లంఘన జరిగితే రూ.5 లక్షల జరిమానా విధించాలి, రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేయాలి అని ఆయన వివరించారు. ఈ చర్యల ద్వారా మద్యం విక్రయానికి సంబంధించి కఠినతను తీసుకురావాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మద్యం పంపిణి పై ముఖ్యమంత్రి సమీక్షా:

మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేస్తే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఎంఆర్పికి మించి మద్యం విక్రయించినట్టు రుజువైతే మొదటి సారి రూ.5 లక్షల జరిమానా విధించాలని, మళ్లీ తప్పు చేస్తే షాపు లైసెన్స్‌ను రద్దు చేయాలని చెప్పారు.

బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి ఉల్లంఘనపై రూ.5 లక్షల జరిమానా విధించాలని, తదుపరి ఉల్లంఘనలపై లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఎం ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను నియంత్రించడానికి కఠినంగా ఉండాలని ఆయన తెలిపారు. అలాగే, అక్రమంగా ఉత్పత్తి చేసిన మద్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

ప్రతి షాపులో సీసీ కెమేరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు మరియు అక్రమ నిల్వలపై దాడులు చేయాలని కూడా సూచించారు.

ఇసుక లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్ష:

రాష్ట్రంలో ఇసుక లభ్యత మరియు సరఫరా పరిస్థితులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇసుక లభ్యతను పెంచాలని, అన్ని రీచ్‌ల నుంచి సులభంగా ఇసుకను తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలకుండా చూడాలని స్పష్టంగా చెప్పారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లయితే, మొదటగా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక సంబంధిత తప్పులపై మొదట అధికారుల పైనే చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు.

మద్యం పాలసీ మరియు ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని కలిగి ఉందని, ఈ విధానాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేందుకు బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ప్రజల జేబులను గుల్ల చేయడానికి ఎవ్వరూ ప్రయత్నించినా, అలాంటివారికి ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు కఠినంగా సూచించారు.