ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లిక్కర్ స్కాం అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కావడం..అతడి విచారణలో కీలక విషయాలు బయటకు వస్తుండడంతో ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. మరోపక్క సిట్ (SIT) సైతం దర్యాప్తును మరింత వేగం చేసింది. ఇప్పటికే 29 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలాంటి వారిని కేసులో చేర్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరగబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కసిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా జగన్ పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?
ఈ కేసు మాత్రమే కాదు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఇసుక స్కాం, భూకబ్జాలపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. విశాఖపట్నంలో జరిగిన భూకబ్జాలపై ప్రత్యేక దృష్టితో విచారణ జరుగుతోంది. ఈ దర్యాప్తుల్లో పెద్ద నాయకులు కూడా చిక్కుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం పరిశీలిస్తే గత ప్రభుత్వాన్ని విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం భారీ వ్యూహంతో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ పై కేసులు పెట్టి, ఆయన్ని రాజకీయంగా అణచివేయాలన్న భావనతో కూటమి నేతలు పని చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా జగన్ తాను ఎదుర్కొనబోయే పరిస్థితులను ముందుగానే ఊహించి, పార్టీ బాధ్యతలను జిల్లా అధ్యక్షులు, పీఏసీ సభ్యులకు అప్పగించినట్టు సమాచారం. తాను దూరంగా ఉన్నా పార్టీ కార్యకలాపాలు కొనసాగేలా దిశానిర్దేశం చేశారు. ఇక 2012 మే నెలలో జగన్ అరెస్ట్ అయిన సంగతి గుర్తు చేస్తూ, ఇప్పుడూ మే నెల కావడం వల్ల రాజకీయంగా మరో సుదీర్ఘ ప్రయాణం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై కేసులు, జైలుశిక్ష వంటి పరిణామాలు వాస్తవమైతే, జగన్ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అసాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.