AP Politics: న్యూస్ మేక‌ర్లుగా `బూతు` నేత‌లు

రాజ‌కీయాలు హుందాగా ఉండాలి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లకు ఒక హ‌ద్దు ఉంటుంది.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 02:10 PM IST

రాజ‌కీయాలు హుందాగా ఉండాలి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లకు ఒక హ‌ద్దు ఉంటుంది. అంతేకాదు, స‌మాజం సిగ్గుప‌డేలా నోరుజార‌కూడ‌దు. స‌భ్యస‌మాజం ఛీత్క‌రించుకునేలా నోరుపారేసుకోవ‌డం మంచి ప‌రిణామం కాదు. ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయ నాయ‌కుల తీరును గ‌మ‌నిస్తే నేటి బాల‌ల్ని రేప‌టి పౌరులుగా ఎలా మార్చాల‌నుకుంటున్నారో అర్థం కావ‌డంలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బండ బూతులు తిట్టుకోవ‌డం మ‌రే రాష్ట్రంలో లేనివిధంగా ఏపీ రాజ‌కీయ చ‌ద‌రంగంలో కనిపిస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి జొర‌బ‌డి నానా హంగామా చేయ‌డం గ‌మ‌నార్హం. తొలుత ప‌వ‌న్ క‌ల్యాణ్ , జ‌న‌సేన నుంచి సోషల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌, బూతుపురాణాలు ఎంట్రీ ఇచ్చాయి. అప్ప‌ట్లో శ్రీరెడ్డి వ‌ర్సెస్ ప‌వ‌న్ బ్యాచ్ కి జ‌రిగిన వార్ లో సోష‌ల్ వేదిక‌లు బూతుల‌తో నిండిపోయాయి. ఆ త‌రువాత కూడా జ‌న‌సైన్యం ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌లేదు. రాజ‌కీయంగా ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే వెంట‌నే సోష‌ల్ వేదిక‌ల‌పై బూతుపురాణం అందుకోవ‌డం అలవాటుగా మారింది. అదే పంథాను వైసీపీ 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఎంచుకుంది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రింత రెచ్చిపోతోంది. ఆ రెండు పార్టీల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఎల్లో సైన్యం వ్య‌క్తిగ‌త జీవితాల‌ను త‌వ్వి తీస్తోంది. బూతుల‌ను, అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను వెంటాడుతోంది.

తొలుత ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌తో మొద‌లైన సోష‌ల్ వార్ క్ర‌మంగా ష‌ర్మిల జీవితంలోకి తొంగిచూసింది. 2019 ఎన్నిక‌ల ముందు ఆమెపై వ‌చ్చిన అస‌భ్య పోస్టుల తాలూకూ రాద్ధాంతం అంద‌రికీ తెలిసిందే. ఆనాడు ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ల‌క్ష్మీపార్వ‌తి ప్రైవేటు వ్య‌వ‌హారాన్ని ప‌లు ర‌కాలుగా చిత్రీక‌రిస్తూ సోష‌ల్ మీడియాను ఎన్నిక‌ల ముందు ఎల్లో సైన్యం వ‌ణికించింది. ప్ర‌తిగా బ్రాహ్మ‌ణి వ్య‌క్తిగ‌త జీవితంలోకి వైసీపీ సోష‌ల్ మీడియా తొంగిచూసింది. లోకేష్‌, బ్రాహ్మ‌ణి వైవాహిక జీవితాన్ని కూడా ఇష్టానుసారంగా ప్ర‌చారం చేసింది. ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి జీవితాన్ని ఎల్లో సైన్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చిచూసింది. రాజ‌కీయ అంశాల‌పై ప‌ర‌స్ప‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా పాటు త‌ర‌చూ వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి పార్టీల‌కు చెందిన సోష‌ల్ మీడియా విభాగాలు వ‌చ్చేస్తున్నాయి. బెడ్ రూం అంశాల‌ను కూడా తోచిన విధంగా గాసిప్స్ రేపుతూ ప్ర‌చారం చేయ‌డం మామూలు అయింది. కోడిక‌త్తి, బాబాయ్ హ‌త్య‌కు సంబంధించిన అంశాల‌ను ప‌లు మార్లు ఎల్లో సైన్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెలుగెత్తింది. అంతేకాదు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి సంబంధించిన విశాఖ లీల‌ల‌ను కూడా అప్ప‌డప్పుడు తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ఆ క‌సినంతా ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య త‌రువాత వైసీపీ సోష‌ల్ మీడియా రెండు రోజులుగా తీర్చుకుంటోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి. ఆమె నాలుగు రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. కానీ, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాత్రం ఉమామ‌హేశ్వ‌రి మానసిక ఒత్తిడికి కార‌ణం చంద్ర‌బాబు, లోకేష్ అంటూ ట్వీట్ చేస్తూ దుమారం రేపారు. ఇంకేముంది దాన్ని చిల‌వ‌లు ప‌లువలుగా వైసీపీ బ్యాచ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేసింది. ఏదో ల్యాండ్ విష‌యంలో లోకేష్ గొడ‌వ ప‌డ్డాడ‌ని, అందుకే ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఊహాగానాలు రేపింది. వాటికి బ‌లం చేకూరేలా లక్ష్మీపార్వ‌తిని మీడియా ముందుకు తీసుకొచ్చింది. సోష‌ల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆమె ఆమోద ముద్ర‌వేసేలా మాట్లాడ‌డం కొస‌మెరుపు. ఒక వైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా గాలిపోగుచేసి ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటోన్న రాజ‌కీయ పార్టీలు ఇటీవ‌ల బ‌హిరంగ వేదిక‌ల‌పై బూతులు తిట్టుకోవ‌డం మొద‌లు పెట్టారు. మాజీ మంత్రి కొడాలి నాని `నీ అమ్మమొగుడు` అంటూ మొద‌లు పెడితే, ఆ ప‌దాన్ని త‌ల‌ద‌న్నేలా బూతులు తింటుకుంటూ ఏపీ రాజ‌కీయ నేత‌లు పోటీప‌డుతున్నారు. వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ జ‌గ‌న్ స్లోగ‌న్ అందుకుంటే, మిగిలిన నాయ‌కులు మీడియాను బూతులు తిట్ట‌డం అల‌వాటు చేసుకున్నారు. తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి మీడియా ముందుకొచ్చిన ఆయ‌న ఏబీఎన్ ఎండీని బూతులు తిట్టారు. అంతేకాదు, మీడియాను కూడా ప‌రుష‌ప‌ద‌జాలంతో విలేక‌రుల ముందే తిట్టారు. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ విలేక‌రులు త‌ల‌దించుకుని వెళ్ల‌డం గ‌మ‌నార్హం.