Site icon HashtagU Telugu

AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలలో ఫెయిలైన వారికి అలర్ట్.. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు..!

ICSE

Exam

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాల (AP Inter Results)ను విద్యాశాఖ మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్టు తెలిపారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి తృతీయ స్థానంలో నిలిచాయని మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరం ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు.

ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మంత్రి సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించిందని చెప్పారు. పరీక్ష ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్‌ 1 వరకు వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Also Read: PM SHRI Scheme: పీఎంశ్రీ స్కీంకు తెలుగు రాష్ట్రాల నుంచి 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక.. తెలంగాణ నుంచి 543 బడులు..!

పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేస్తుందన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మార్చి 15న మొదలైన ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 4న ముగిశాయి.