Taneti Vanitha : కొన్ని అత్యాచారాలు అలా జరుగుతుంటాయ్

ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి తానేటి వనిత మరోవారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:14 AM IST

ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి తానేటి వనిత మరోవారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లులు పిల్లలను సరిగా పెంచడం లేదంటూ ఈమధ్యనే ఆమె విశాఖపట్నంలో అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తల్లులను అవమానిస్తారా అంటూ ఆందోళనలకు దిగాయి. ఈ వేడి ఇంకా చల్లారకముందే మంగళవారం నాడు గుంటూరులో రేపల్లె అత్యాచార ఘటనపై వనిత స్పందించిన తీరు కూడా వివాదాస్పదమైంది. చర్చలకు దారితీసింది.

గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గోవడానికి వచ్చిన ఏపీ హోంశాఖా మంత్రి తానేటి వనిత… రేపల్లె ఘటనలో అత్యాచారానికి పాల్పడినవారు.. లైంగికదాడి చేయాలన్న ఉద్దేశంతో రాలేదన్నారు. వాళ్లు అప్పటికే తాగి ఉన్నారని.. డబ్బును ఆశించి ఆమె భర్తపై దాడికి దిగారన్నారు. దీంతో ఆమె తన భర్తను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో వాళ్లు ఆమెను నెట్టివేయడానికి,
బంధించడానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అత్యాచారానికి గురైంది. పేదరికం, మానసిక పరిస్థితుల వల్ల అనుకోని రీతిలో అత్యాచారాలు జరుగుతుంటాయి అని హోం మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఇప్పటికే ఏపీలో గత మూడేళ్లకాలంలోనే 800 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిగాయంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి సమయంలో వివాదాస్పదమయ్యేలా, చర్చకు దారితీసేలా హోంమంత్రి వ్యాఖ్యానించడంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి ఇలా వ్యాఖ్యానిస్తారా అంటూ ఫైరయ్యాయి.

రేపల్లె అత్యాచార ఘటనకు, పోలీస్ సిబ్బంది కొరతకు సంబంధమే లేదని హోం మంత్రి వనిత చెప్పారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని అంగీకరిస్తూనే.. ఆ ఖాళీల భర్తీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.