Site icon HashtagU Telugu

Amaravathi : అమ‌రావతికి హైకోర్టు బాస‌ట

Amaravati

Amaravati

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో శాస‌న‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య సున్నిత‌మైన సంఘ‌ర్ష‌ణ కొన‌సాగుతోంది. సీఆర్డీయే ర‌ద్దు, మూడు రాజ‌ధానుల‌పై కీల‌క తీర్పును గుర‌వావారం ఏపీ హైకోర్టు వెలువ‌రించింది. ఒప్పందం ప్ర‌కారం రాజ‌ధాని భూముల‌ను అభివృద్ధి చేసి రైతుల‌కు ప్లాట్ల‌ను అప్ప‌గించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, రాజ‌ధాని భూముల‌ను ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌ను ఉప‌యోగించ‌డానికి లేద‌ని చెప్పింది. మూడు నెల‌ల్లోగా రైతుల‌కు ప్లాట్ల‌ను అప్ప‌గించాల‌ని ఆదేశించింది. ఆరు నెల‌ల్లో సీఆర్డీయే మాస్ట‌ర్ ప్లాన్ ను పూర్తి చేయాల‌ని తీర్పు చెప్పింది. అమ‌రావ‌తిలోని ప్ర‌భుత్వ ఆఫీస్ ల‌ను త‌ర‌లించ‌డానికి వీల్లేద‌ని తేల్చేసింది. రాజ‌ధానిపై శాస‌నం చేసే అధికారం ప్ర‌భుత్వానికి లేద‌ని హైకోర్టు తీర్పు చెప్ప‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.సాధార‌ణంగా శాస‌నం చేసే అధికారం చ‌ట్ట స‌భ‌లకు ఉంటుంది. వాటిని అమ‌లు చేసే బాధ్య‌త‌ను నిర్వాహ‌ణ వ్య‌వ‌స్థ చేప‌డుతుంది. ఆ చ‌ట్టాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు కాన‌ప్పుడు న్యాయ‌ వ్య‌వ‌స్థ జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగంలో ఆ విష‌యాన్ని క్లియ‌ర్ గా పొందుప‌రిచారు. కానీ, అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్ర‌భుత్వానికి చ‌ట్టం చేసే అధికారం లేదంటూ పొందుప‌ర‌చ‌డం మ‌రోసారి శాస‌న‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య గ్యాప్ క‌నిపించేలా ఉంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు.

వాస్త‌వంగా చంద్ర‌బాబు స‌ర్కార్ సీఆర్డీఏ ను ఏర్పాటు చేసింది. అమ‌రావ‌తి రైతులతో ఒప్పందాలు చేసుకునేలా దానికి హ‌క్కుల‌ను ఆనాటి ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఆ మేర‌కు భూములు ఇచ్చిన రైతుల‌కు వ్యాణిజ్య‌, గృహాల కోసం ప్లాట్ల‌ను ఇస్తామ‌ని సీఆర్డీయే అంగీక‌రిస్తూ రాత‌పూర్వ‌కంగా ఒప్పందం చేసుకుంది. ఆ ప్ర‌కారం సింగ‌పూర్ క‌న్సార్టియంతో సీఆర్డీయే చేతులు క‌లిపింది. రాజ‌ధాని కోసం మాస్ట‌ర్ ప్లాన్ ను సింగ‌పూర్ క‌న్సార్టియం త‌యారు చేసింది. అలాంటి మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేయ‌డానికి ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చు అవుతుందని ఆనాడే అంచ‌నా వేయ‌డం జ‌రిగింది. క‌న్సార్టియంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం మ్యాప్ ల‌ను రైతుల‌కు అందించింది. కోట్లాది రూపాయల విలువైన ప్లాట్లు వ‌స్తాయ‌ని రైతులు ఆశ‌ప‌డ్డారు. క‌న్సార్టియం చూపిన గ్రాఫిక్స్ ప్ర‌కారం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ఆనాడు జ‌రిగింది.2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో సీఆర్డీయే ర‌ద్దుతో పాటు మూడు రాజ‌ధానుల బిల్లు అమ‌ల్లోకి వ‌చ్చింది. ఫ‌లితంగా సీఆర్డీయేతో రైతుల చేసుకున్న ఒప్పందాలు బుట్ట‌దాఖ‌లు అయ్యాయి. అనూహ్యంగా వ‌చ్చి ప‌డే కోట్ల రూపాయ‌ల క‌ల క‌రిగిపోయింది. దీంతో రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో తేల్చుకోవాల‌ని సుప్రీం తేల్చి చెప్ప‌డంతో ఏపీ హైకోర్టు వేగంగా విచార‌ణ జ‌రిపింది. వివిధ ర‌కాలుగా వ‌చ్చిన 75 పిటిష‌న్ల‌పై హైకోర్టు ప్ర‌త్యేకంగా విచార‌ణ చేప‌ట్టింది. దీంతో సీఆర్డీయే ర‌ద్దు, మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ స‌ర్కార్ ఉప‌సంహ‌రించుకుంది. ఫ‌లితంగా చంద్ర‌బాబు హ‌యాంలోని సీఆర్డీయే ఆటోమాటిక్ గా మ‌ళ్లీ లైవ్ లోకి వ‌స్తుంద‌ని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం మ‌ళ్లీ స‌మ‌గ్ర రూపంలో మూడు రాజ‌ధానుల బిల్లు పెడ‌తామంటూ అసెంబ్లీ వేదిక‌గా వెల్ల‌డించాడు.

ప్ర‌భుత్వం, రైతుల వాద‌న‌ల‌ను సుదీర్ఘంగా ఆల‌కించిన హైకోర్టు గురువారంనాడు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఆనాడు చంద్ర‌బాబు స‌ర్కార్ ఇచ్చిన హామీల‌న్నింటీనీ నెర‌వేర్చాల‌ని ప‌రోక్షంగా హైకోర్టు ఆదేశించింది. పైగా వాటిపై చ‌ట్టాలు చేయ‌డానికి లేదంటూ హైకోర్టు ధ‌ర్మాస‌నం చెప్ప‌డాన్ని వైసీపీ అభ్యంత‌ర పెడుతోంది. చ‌ట్టాలు త‌యారు చేయ‌డం, ర‌ద్దు చేయ‌డం అనేది ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తోంది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని హైకోర్టు తేల్చి చెప్ప‌డాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిశీలిస్తోంది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేయ‌డంపై కూడా ఆలోచిస్తోంది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని తీర్పు చెప్ప‌డంపై అధ్య‌య‌నం చేస్తోంది.అమ‌రావ‌తి రాజ‌ధాని ఫ‌క్తు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ జ‌గ‌న్ స‌ర్కార్ తొలి నుంచి ఆరోపిస్తోంది. చంద్ర‌బాబుకు చెందిన కోట‌రీ రాజ‌ధాని ప్రాంతంలో వంద‌లాది ఎకరాలు ముందుగా కొనుగోలు చేసి క్విడ్ ప్రో కో త‌ర‌హా గాబ్లింగ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తోంది. పైగా ల‌క్ష‌ల కోట్ల‌తో రైతుల‌కు ప్లాట్ల‌ను అభివృద్ధి చేసి ఇవ్వ‌డం సాధ్య‌ప‌డ‌ద‌ని చెబుతోంది. సీఆర్డీయేను ర‌ద్దు చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం దాని స్థానంలో అమ‌రావ‌తి మెట్రో పాలిట‌న్ రీజిన‌ల్ అథారిటీ(ఏఎంఆర్డీయే)ను ఏర్పాటు చేసింది. దాని ప్ర‌కారం అమ‌రావతి రాజ‌ధాని ప‌రిధిలోని మండ‌లాల విభ‌జ‌న జ‌రిగింది. అందుకు సంబంధించిన జీవోలు ప్ర‌స్తుతం అమలులో ఉన్నాయి. వీట‌న్నింటికీ ఒక స్ప‌ష్ట‌త ఇప్ప‌టికీ లేదు. అయిన‌ప్ప‌టికీ రైతుల‌కు మాత్రం ఆరు నెల‌లు లోగా మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం ప్లాట్ల‌ను అభివృద్ధి చేసి ఇవ్వాల‌ని హైకోర్టు తీర్పు చెప్ప‌డం ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌డంలేదు.

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోని భూములు సుమారు వెయ్యి ఎక‌రాలు మిన‌హా మిగిలినవి రైతుల ఆధీనంలోనే ఉన్నాయని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికీ ఆ భూముల్లో రైతులు వ్య‌వ‌సాయం చేసుకుంటున్నార‌ని చెబుతోంది. మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం వాళ్లంద‌రూ ఇప్పుడు ప్ర‌భుత్వానికి భూముల‌ను స్వాధీనం చేయాలి. భౌతికంగా భూములు రైతుల వ‌ద్ద ఉన్న వాటిని ప్ర‌భుత్వం ఇప్ప‌ట్లో తీసుకోవ‌డం క‌ష్టం. అమ‌రావ‌తి కోర్ కాపిట‌ల్ ప్రాంతంలో ఉన్న భూములు మాత్రమే ప్ర‌భుత్వం ఆధీనంలో ఉన్నాయి. మిగిలిన వాటిలో రైతులు వ్య‌వ‌సాయం చేసుకోవ‌డాన్ని ప్ర‌భుత్వం కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటుంది. వీట‌న్నింటికీ ప‌రిష్కారం రావాలంటే హైకోర్టు తీర్పు చెప్పినంత ఈజీ కాదు. సో..హైకోర్టు తీర్పు త‌రువాత జ‌గ‌న్ స‌ర్కార్ వేసే అడుగుల మీద రైతుల భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.