AP High Court : నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి బ‌దిలీ చేసిన ఏపీ హైకోర్టు

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 02:09 PM IST

నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐతో విచారణకు హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలు కనిపించలేదు. గత ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో కోర్టులో దొంగతనాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరు కోర్టు కాంప్లెక్స్‌లోని 4వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి చోరీ జరిగింది. అయితే మరుసటి రోజు ఉదయం దొంగతనాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది స్థానిక చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టులోని ఫైళ్లు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరడంతో తాజాగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుని సీబీఐకి అప్పగించింది. ఫైల్ చోరీ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది.