Minister Rajini : ప్ర‌జ‌ల ఆరోగ్యానికి జ‌గ‌న్ స‌ర్కార్ పెద్ద పీట వేస్తుంది.. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌పై మంత్రి రజిని

జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష.. ప్ర‌జ‌లంద‌రికీ ర‌క్ష అని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. మంగ‌ళగిరిలోని రాష్ట్ర

  • Written By:
  • Updated On - September 16, 2023 / 08:54 PM IST

జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష.. ప్ర‌జ‌లంద‌రికీ ర‌క్ష అని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. మంగ‌ళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు ఏకంగా 90 శాతం కుటుంబాలు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొందుతున్నాయని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీని ఎంత‌గా బ‌లోపేతం చేసిందో , ఏ స్థాయిలో వైద్య సేవ‌లు అందిస్తున్న‌దో దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చని అన్నారు. జ‌గ‌న‌న్న ప్ర‌వేశ‌పెట్టిన ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 2.30 కోట్ల ఓపీలు న‌మోద‌య్యాయ‌ని, ఇది ఒక చ‌రిత్ర‌ని మంత్రి ర‌జిని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం దాదాపు 8,500 కోట్ల రూపాయాల ఖ‌ర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను కొత్త‌గా నిర్మిస్తోందన్నారు. నిన్న‌ (15వ తేదీన‌) సీఎం జ‌గ‌న్ ఐదు మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను విజ‌య‌న‌గ‌రం నుంచి పారంభించారని గుర్తు చేశారు. మ‌రో రెండేళ్ల‌లో మిగిలిన 12 క‌ళాశాల‌ల‌ను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామ‌న్నారు.

జ‌గ‌న‌న్న సంక్షేమ రాడార్ నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోకూడ‌ద‌నే ల‌క్ష్యంతో ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం రూపుదిద్దుకుంద‌న్నారు. మొత్తం ఐదు ద‌శ‌ల్లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. మొద‌టి ద‌శ‌లో వాలంటీర్ల ఇంటింటి స‌ర్వే చేస్తార‌ని.. ఈ స‌ర్వే నిన్న‌టి నుంచి(15వ తేదీన) ప్రారంభ‌మైంద‌న్నారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వాలంటీర్లు, ఎన్ ఎస్ ఎస్‌, స్వ‌చ్ఛంద సంస్థ‌ల కార్య‌క‌ర్త‌ల బృందం తొలి ద‌శ‌లో గ్రామాల్లో ఇంటింటికీ వెళుతుంద‌ని చెప్పారు. ఈ బృందం ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం గురించి ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తోందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీహెచ్‌వో గాని, ఎఎన్ఎంగాని అదే ఇంటికి ఎప్పుడు వ‌స్తారో చెప్పి.. ఆ రోజు క‌చ్చితంగా ఇంటి వ‌ద్ద‌నే ఉండాల‌ని వాలంటీర్లు స‌మాచారం ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్య‌శ్రీ కి సంబంధించిన అవ‌గాహ‌నా ప‌త్రాల‌ను ప్ర‌తి ఇంటికీ తీసుకెళ్లి ఈ ప‌థ‌కం గురించి పూర్తిస్థాయిలో చైత‌న్యం క‌లిగిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలో ఉన్న ఆస్ప‌త్రులు ఏంటి..? ఆ ఆస్ప‌త్రులు అందించే సేవ‌ల వివ‌రాలు.. ఇలా అన్ని విష‌యాలు వాలంటీర్ల బృందం అంద‌రి ఇళ్ల‌కు వెళ్లి ఇప్ప‌టికే గ్రామాల్లో వివ‌రిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఆరోగ్య‌శ్రీ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసి అంద‌రి సెల్‌ఫోన్ల‌లో అందుబాటులో ఉండేలా వాలంటీర్లు ఈ క్యాంపెయిన్‌లో చొర‌వ‌చూపుతున్నార‌ని పేర్కొన్నారు.