ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) తీసుకోవడం ఇకపై అంత ఈజీగా ఉండబోదు. రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తాజాగా డ్రైవింగ్ పరీక్ష విధానంలో సెన్సార్ ఆధారిత పద్ధతి(Sensor based method)ని ప్రవేశపెట్టింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానం అమలులోకి వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సిస్టమ్ అమలులోకి తీసుకురానున్నట్లు విశాఖ ఆర్టీఓ రామ్ కుమార్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్నవారికే లైసెన్స్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఇప్పటి వరకు లైసెన్స్ కొందరికి అధికారుల సిఫార్సు మీద గాని, లేదా డ్రైవింగ్ నెరిపించకుండా కూడా బోకర్ల ద్వారా లభించేది. అయితే కొత్తగా అమలు చేస్తున్న సెన్సార్ పద్ధతితో అటువంటి అక్రమాలు ఇక సాధ్యపడవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డైవింగ్ పరీక్ష సమయంలో దరఖాస్తుదారుల వాహనానికి సెన్సార్ మిషన్ అమర్చడం జరుగుతుంది. అది ట్రాక్ పైన వారు నడిపే తీరును పూర్తిగా నమోదు చేసి, తుది ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ఎవరూ అక్కడ ఉండకపోయినా, సెన్సార్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే లైసెన్స్ ఇవ్వబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా లైసెన్స్ తీసుకోవడం నిజంగా డ్రైవింగ్ తెలిసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. దీని వల్ల రోడ్లపై ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ఆన్‌లైన్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు https://www.aptransport.org వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని, తర్వాత సరైన శిక్షణ పొందిన తర్వాత మాత్రమే సెన్సార్ ఆధారిత ఫైనల్ డ్రైవింగ్ టెస్ట్ కోసం హాజరుకావాలి. ఇది పూర్తిగా పారదర్శకమైన విధానం కావడంతో, ప్రజల విశ్వాసం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.