ప్ర‌శ్నించే బూతు రాజ‌కీయం..అడ్డ‌గోలు ప్ర‌భుత్వానికి తిట్ల‌దండ‌కం

ప్ర‌జ‌ల కోసం..ప్ర‌జ‌ల కొర‌కు..ప్ర‌జ‌ల చేత ప్రజాస్వామ్యబ‌ద్ధంగా ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ‌తాయి. అవి, ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌లకు మెరుగైన పాల‌న అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. ఆ మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు రాజ్యాంగంపై ప్ర‌మాణం చేసి పాల‌నా ప‌గ్గాలు చేప‌డ‌తారు.

  • Written By:
  • Publish Date - September 29, 2021 / 02:09 PM IST

ప్ర‌జ‌ల కోసం..ప్ర‌జ‌ల కొర‌కు..ప్ర‌జ‌ల చేత ప్రజాస్వామ్యబ‌ద్ధంగా ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ‌తాయి. అవి, ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌లకు మెరుగైన పాల‌న అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. ఆ మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు రాజ్యాంగంపై ప్ర‌మాణం చేసి పాల‌నా ప‌గ్గాలు చేప‌డ‌తారు. ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం భారం లేకుండా ప‌రిపాల‌న చేయాలి. సామాన్యులకు క‌ష్టం రాకుండా ప్ర‌భుత్వాలు కాపాడుకోవాలి. రైతులు, శ్రామికులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల శ్రేయ‌స్సు పాల‌నా విధానాల్లో క‌నిపించాలి. ఆ దిశ‌గా ప‌రిపాల‌న ప్రాధాన్య‌త‌ల‌ను ఎంచుకోవాలి.
ప్రాధాన్య‌త‌ల‌ను తెలుసుకోవ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం త‌డ‌బ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. సంక్షేమ ప‌థ‌కాల‌ను పెద్ద ఎత్తున జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. అందుకోసం భారీగా రుణాల‌ను తీసుకుంటోంది. అదే స‌మ‌యంలో రాబ‌డిని పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ క్ర‌మంలో మ‌ద్యం రేట్ల‌ను అమాంతం పెంచింది. డీజీల్‌, పెట్రోలు ధ‌ర‌ల‌పై కేంద్ర భారంతో పాటు రాష్ట్ర భారం అత్య‌ధికంగా ఉంది. ఇసుక, విద్యుత్, సిమెంట్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోతోంది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు గుర్రంలా పెరుగెడుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను నియంత్రించాలి. ఆ ప్ర‌య‌త్నం ఎక్క‌డ చేయాలో..అక్క‌డ చేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ నేల విడ‌చి సాము చేస్తోంది.
సామాన్యుల‌కు సినిమా టిక్కెట్లు అందుబాటులో లేవ‌ని నియంత్ర‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించింది. బ్లాక్ టిక్కెట్ల అమ్మ‌కాన్ని ఆపాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. ఆ క్ర‌మంలోనే ఆన్ లైన్ టిక్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది. అంత వ‌ర‌కు బాగానే ఉంది. మిగిలిన వాటి ధ‌ర‌ల‌ను ఆకాశాన్ని తాకుతుంటే, వాటి సంగ‌తి ఏంట‌ని ప్ర‌తిప‌క్షం, విప‌క్షాల ప్ర‌శ్న‌. ఇక్క‌డే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త క్ర‌మం లోపించింది. అందుకే, విమ‌ర్శ‌ల పాల‌వ‌డంతో పాటు న‌వ్వుల పాల‌వుతోంది.
ఏపీలో సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానంపై రాజ‌కీయ దాడికి జ‌న‌సేన కొత్త‌కోణం ఎంచుకుంది. నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌ని అడుగుతోంది. సిమెంట్ ధ‌ర‌ల‌ను, ఇసుక ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి ఆన్ లైన్ విధానం పెట్టాల‌ని డిమాండ్ చేస్తోంది. మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆన్ లైన్ చేయాల‌ని కోరుతుంది. ఒక వేళ సినిమా టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌లేక‌పోతే..సినిమా చూడ‌డం మానేస్తారు. కానీ, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఎంత ఉన్నా..సామాన్యులు కొనుగోలు చేయాలి. అందుకే, ముందు నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నియంత్రించాల‌ని జ‌న‌సేన నిన‌దిస్తోంది. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానం కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌ను టార్గెట్ చేసి ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది. అందుకే, ఇప్పుడు ప్ర‌భుత్వానికి, జ‌నసేన‌కు మ‌ధ్య ఆన్ లైన్ వార్ సోష‌ల్ మీడియా రూపంలో జ‌రుగుతోంది. ఆ వార్ బూతు రూపం సంత‌రించుకుంది. ఈ ప‌రిణామం స‌మాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. మేలు చేయ‌క‌పోగా…భావి త‌రాల‌కు అస‌భ్య‌క‌ర‌మైన రాజ‌కీయాన్ని అందించిన ఛండాలురుగా మిగిలిపోతారు. సో..ఇక‌నైనా ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు ప‌నిచేసే చేయాల‌నుకునే పార్టీలు ఆరోగ్య‌‌క‌ర‌మైన రాజ‌కీయాన్ని న‌డ‌పాల‌ని కోరుకుందాం.