Site icon HashtagU Telugu

Million March : ఏపీలో `మిలియ‌న్ మార్చ్`పై `షాడో `

Jagan power

Ap Employees Jagan

ఏపీలోని టీచ‌ర్లు, ప్ర‌భుత్వ ఉద్యోగులు ర‌గిలిపోతున్నారు. సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన మిలియ‌న్ మార్చ్ కు సిద్ధం అవుతున్నారు. సీపీఎస్ ర‌ద్దు చేయాల‌ని చాలా కాలంగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దాని స్థానంలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్ వ‌ద్దంటూ జిల్లాల వారీగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో మంత్రుల క‌మిటీ టీచ‌ర్లు, ఉద్యోగుల సంఘ నేత‌ల‌తో ప‌లుమార్లు స‌మావేశం అయింది. తాజాగా మంత్రి బోత్సా స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలోని మంత్రుల క‌మిటీ శుక్ర‌వారం సాయంత్రం మ‌రోసారి భేటీ కానుంది.

మిలియ‌న్ మార్చ్ జ‌ర‌గ‌కుండా చూడాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాల‌ను ర‌చిస్తోంది. ప్ర‌భుత్వానికి స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి బాస‌ట‌గా ఉన్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా హైకోర్టు సైతం ఏపీ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఇటీవ‌ల ఆయ‌న సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఆ రోజు నుంచి ఆయ‌న మీద ఉద్యోగులు కొంద‌రు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆయ‌న స్టేట్ మెంట్ ను గ‌మ‌నిస్తే ఉద్యోగులు రెండుగా చీలిపోయార‌ని స్ప‌ష్టం అవుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ కు అనుకూలంగా ఒక వ‌ర్గం వ్య‌తిరేకంగా మ‌రో గ్రూప్ ప‌నిచేస్తుంద‌ని సంకేతాలు బ‌లంగా వెళ్లాయి.

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని జ‌గ‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. కానీ, చ‌ట్టాలు అందుకు అనుగుణంగా లేవ‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ తెలుసుకున్నారు. ప్ర‌త్యామ్నాయంగా జీపీఎస్ ను తీసుకొచ్చారు. కానీ, టీచర్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో `చలో విజయవాడ`ను సీపీఎస్ ర‌ద్దు కోసం చేశారు. ఆ కార్య‌క్ర‌మాన్ని టీచర్లే విజయవంతం చేశారు. పీఆర్సీ విషయంలో మోసం జ‌రిగింద‌ని వాళ్లు భావిస్తున్నారు. జీతాలు తగ్గించడం, సీపీఎస్ రద్దు సహా అనేక అంశాల్లో ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు.

పాఠ‌శాల‌ల‌కు టీచ‌ర్ల‌ను స‌రైన స‌మ‌యానికి ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేసిన జ‌గ‌న్ ఇటీవ‌ల ఫేస్ రిగ‌గ్నైజేష‌న్ ప‌ద్ధ‌తిని పెట్టారు. దీంతో మ‌రింత ఆగ్ర‌హంగా ప్ర‌భుత్వం మీద ఉన్నారు. స్కూల్స్ కు టైంకు రాలేక‌పోతున్న టీచ‌ర్లు ర‌గిలిపోతున్నారు. ఆ కోపాన్ని మిలియ‌న్ మార్చ్ సంద‌ర్భంగా తీర్చుకోవాల‌ని క‌సిగా ఉన్నారు. నిమిషం లేటుగా స్కూల్ కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒక పూట సెల‌వుగా ప‌రిగ‌ణించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే, టీచ‌ర్లు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌నిభారం ఎక్క‌వ‌గా ఉంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ మీద కోపంతో ఉంది. ఫ‌లితంగా మిలియ‌న్ మార్చ్ ను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా ఉద్యోగుల త‌ఢాఖా ఏమిటో జ‌గ‌న్ రుచిచూపాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న ఒక గ్రూప్ మాత్రం ప్ర‌భుత్వానికి బాస‌టా నిల‌వాల‌ని అడుగులు వేస్తోంది.

ప్ర‌భుత్వ అనుకూల టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాల నాయ‌కుల స‌హ‌కారంతో మిలియ‌న్ మార్చ్ లేకుండా చేయాల‌ని ప్ర‌భుత్వం వ్యూహాల‌ను ర‌చిస్తోంది. ఒక వేళ `చ‌లో విజ‌య‌వాడ‌` త‌ర‌హాలో విజ‌య‌వంతం అయితే మిగిలిన వ‌ర్గాలు కూడా ప్ర‌భుత్వం మీద తిర‌గ‌బ‌డే ఛాన్స్ ఉంది. అందుకే, సీరియ‌స్ గా ప్ర‌భుత్వం టీచ‌ర్లు, ఉద్యోగుల మిలియ‌న్ మార్చ్ స‌న్నాహాల మీద క‌న్నేసింది. ఉద్యోగ, టీచ‌ర్ల సంఘాల‌ను విచ్ఛ‌న్నం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఎంత వ‌ర‌కు ప్ర‌భుత్వం స‌క్సెస్ అవుతుందో చూడాలి.