ఏపీ టు తెలంగాణ.. స్థానికేతర ఉద్యోగులకు గుడ్ న్యూస్!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లంతా వివిధ ప్రభుత్వపరమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటికీ అలాగే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 8, 2021 / 03:20 PM IST

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లంతా వివిధ ప్రభుత్వపరమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటికీ అలాగే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రిలీవ్ కల్పించనుంది. ఈ మేరకు ఉత్తర్వలు కూడా రిలీజ్ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లలో సుమారు 2వేల మంది వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలనుకున్న ఉద్యోగులు..వచ్చేనెల 7లోగా ఆప్షన్లు ఇవ్వాలని సీఎస్ సమీర్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత హెచ్​వోడీలకు ఆప్షన్లు ఇవ్వాల్సిందిగా సూచించారు. ఉద్యోగుల అభ్యర్థన మేరకు..స్థానికత, భాగస్వామి దృష్ట్యా తెలంగాణకు పంపాలని ఉద్యోగుల గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తిని సంఘం ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా..రిలీవ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. తెలంగాణ వెళ్లాలనుకునే వారి నుంచి ఆప్షన్ ఫార్మ్స్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఈనెల 5న ఆదేశించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ కిందటి నెల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్కడి సర్కారుకు తెలియజేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం విడిపోవడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట పనిచేయాల్సి వచ్చిందని, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకెంతో సంతోషాన్నిస్తుందని చాలామంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.