AP Assembly : విశాఖ నుంచి పాల‌న! అసెంబ్లీ చివ‌రి రోజు 3 రాజ‌ధానుల బిల్లు?

మూడు రాజ‌ధానుల‌పై స‌మ‌గ్ర బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. వ‌ర్షాకాల స‌మావేశాల చివరి రోజు బిల్లును ప్ర‌వేశ పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 04:50 PM IST

మూడు రాజ‌ధానుల‌పై స‌మ‌గ్ర బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. వ‌ర్షాకాల స‌మావేశాల చివరి రోజు బిల్లును ప్ర‌వేశ పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అధికార వికేంద్ర‌క‌ర‌ణ‌పై గురువారం సుదీర్ఘంగా వివ‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బిల్లును సిద్ధం చేయిస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌పై క్లారిటీగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ స‌మావేశాల్లోనే బిల్లుకు ఆమోదం తెల‌ప‌డానికి సిద్ధం అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం మండ‌లిలోనూ వైసీపీ స‌భ్యులు మెజార్టీ ఉన్నారు. దీంతో గ‌తంలో మాదిరిగా సాంకేతిక సమ‌స్య‌లు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

పరిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం ఖాయ‌మంటూ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విశాఖ నుంచి ప‌రిపాల‌న ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించ‌డం ఉద్యోగులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌లు కార్యాల‌యాల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను విశాఖ‌లో చేశార‌ని తెలుస్తోంది. మూడు ప్రాంతాల్లోని సెంటిమెంట్ ను గ‌మ‌నించిన త‌రువాత మూడు రాజ‌ధానుల‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టత‌తో ఉంది. ఆ మేర‌కు మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు చేశారని తెలుస్తోంది.

మూడు రాజ‌ధానుల బిల్లును ఈ స‌మావేశాల్లోనే ఆమోదించాల‌ని క‌ర్నూలు బార్ అసోసియేష‌న్ డిమాండ్ చేస్తోంది. ఆ మేర‌కు గ‌త రెండు రోజులుగా ఆందోళ‌న కొనసాగిస్తోంది. న్యాయ రాజ‌ధాని క‌ర్నూలు త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ అక్క‌డి న్యాయ‌వాదులు రెండు రోజులుగా ధ‌ర్నాలు చేస్తున్నారు. బిల్లు పెట్టే వ‌ర‌కు ఈ ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని క‌ర్నూలు బార్ అసోసియేష‌న్ భీష్మించింది. మ‌రో వైపు ఉత్త‌రాంధ్ర‌లోని మంత్రులు అమ‌ర్నాథ్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం ఉండాల‌ని డిమాండ్ చేసేలా స‌మాయాత్తం చేస్తున్నారు.

అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లికి రైతులు చేస్తోన్న మ‌హాపాద‌యాత్ర 2.0 ఉత్త‌రాంధ్ర‌పై దండ‌యాత్ర‌గా వైసీపీ మంత్రులు భావిస్తున్నారు. ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టేలా మ‌హాపాద‌యాత్ర ఉంద‌ని అసెంబ్లీ వేదిక‌గా సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి కూడా విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చూస్తుంటే రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో వీలున్నంత సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. మూడు ప్రాంతాల మ‌ధ్య అల‌జ‌డి రేపి, అదే స‌మ‌యంలోనే మూడు రాజ‌ధానుల స‌మ‌గ్ర బిల్లును మ‌రోసారి అసెంబ్లీలో ఆమోదింప చేయ‌డానికి జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు అధికారిక వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.