YSR Village clinics: ఆంధ్రాలో లండ‌న్ త‌ర‌హా వైద్యం

లండ‌న్ త‌ర‌హా వైద్యం అందించే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 01:45 PM IST

లండ‌న్ త‌ర‌హా వైద్యం అందించే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు వేస్తోంది. ప్ర‌జారోగ్యానికి పెద్ద‌పీట వేస్తోన్న ఏపీ ప్ర‌భుత్వం ఈనెల 18వ తేదీ నుంచి వైఎస్సాఆర్ విలేజ్ క్లినిక్ లపై యుద్ధ ప్రాతిప‌దిక‌న త‌నిఖీలు చేయాల‌ని నిర్ణ‌యించింది. నాడు-నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా వైద్య‌రంగంలోని మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డం, కొత్త వాటిని అందుబాటులోకి తీసుకురావాల‌ని గ‌తంలోనే జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఆ క్ర‌మంలో చోటుచేసుకున్న మార్పుల‌పై ప్ర‌భుత్వం స‌మీక్ష చేయ‌నుంది.

శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ లు అందిస్తున్న సేవల నాణ్యతను పరిశీలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలు విలేజ్ క్లినిక్‌లలో తనిఖీలు నిర్వహించ‌బోతున్నారు. సేవలపై అధ్య‌య‌నం చేయ‌బోతున్నారు. తనిఖీల కోసం వైద్య ఆరోగ్య శాఖ APHSSP-SC-HDWC పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సిన అంశాలతో ప్రశ్నావళిని రూపొందించింది. తనిఖీల్లో తేలిన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రారంభించింది. ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 6వేలకు పైగా దవాఖాన‌లు అందుబాటులో ఉండడంతో గ్రామాల్లో గర్భిణులు, చిన్నారులకు 12 రకాల వైద్యసేవలు, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులను అందిస్తున్నారు.

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు చేయగా, 8,534 కొత్త భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే 8,347 ఎంఎల్‌హెచ్‌పీల నియామకాలు పూర్తయ్యాయి. సగటున 23 OPలు, ఎనిమిది పరీక్షలు ప్రతిరోజూ క్లినిక్‌లలో నమోదు చేయబడుతున్నాయి. టెలిమెడిసిన్ ద్వారా క్లినిక్‌లలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో ఉంచబడ్డాయి. రోజూ సగటున 4,500 మంది టెలిమెడిసిన్‌ని పొందుతున్నారు. అర్హత కలిగిన వైద్యుల ద్వారా రోగులు క్లినిక్‌లలో టెలిమెడిసిన్ సేవలను పొందుతున్నారా? జీవనశైలి వ్యాధి స్క్రీనింగ్‌పై ANM, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) శిక్షణను పూర్తి చేయడం వంటి వివిధ పారామితులపై తనిఖీలు చేయ‌నున్నారు.