ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - October 6, 2021 / 04:17 PM IST

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత న్యాప్ కిన్స్ అందనున్నాయి.

దేశంలో దాదాపు 23 శాతం మంది అమ్మాయిలు పీరియడ్స్ టైంలో స్కూళ్లు, కాలేజీలకు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగానే ఎంతోమంది విద్యార్థినులు విలువైన చదువును కోల్పోతున్నారు. అంతేకాదు.. పలు విద్యాసంస్థల్లో సరైన టాయిలెట్స్ లేకపోవడం కారణంగానూ హాజరుశాతం ఘోరంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాడు-నేడు స్కీమ్ కింద అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ స్కీమ్ వర్తించనుంది.

రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ప్రతినెలా ఈ శానిటరీ న్యాప్ కిన్స్ అందిస్తారు. మహిళా పోలీసులు, మహిళా టీచర్లు కలిసి న్యాప్ కిన్స్ పిల్లలకు అందిస్తారు. అంతేకాదు.. రుతుస్రావం సమయంలో విద్యార్థినులు ఎలా ఉండాలి? ఏయేం జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఏపీలో అమ్మాయిలపై దాడులు పెరిగిపోతుండటంతో దిశ చట్టంపై కూడా అవగాహన కల్పించనున్నారు. ఏదైనా ఆపదకాలంలో అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించి చెప్తారు. న్యాప్ కిన్స్ పంపణీ సక్రమంగా అమలయ్యేందుకు జాయింట్ కలెక్టర్, ఓ మహిళ టీచర్ కేత్రస్థాయిలో పనిచేస్తారు.

విద్యార్థినుల న్యాప్ కిన్స్ కోసం ఏపీ ప్రభుత్వం 32 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి విద్యార్థిని ఏడాదికి 120 న్యాప్ కిన్స్ ను ఉచితంగా పొందనున్నారు. నాడు-నేడు ద్వారా 56,703 పాఠశాలలు, హాస్టల్స్‌లోని టాయిలెట్స్ కూడా నిర్మించనున్నారు.  మొదటి దశలో, 15,715 పాఠశాలల్లో టాయిలెట్లు పూర్తయ్యాయి. మిగిలిన అన్ని పాఠశాలలు 2023 నాటికి పూర్తవుతాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థినులకు బాగా ఉపయోగపడనుంది.