ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాల్య వివాహాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. వివాహాల కారణంగా చదువు మానేసిన బాలికలను గుర్తించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో యూనిసెఫ్ ప్రతినిధులతో చర్చలు జరిపిన సీఎస్ జవహర్‌రెడ్డి.. బాల్య వివాహాలను నియంత్రించకుంటే మాతాశిశు మరణాల రేటును తగ్గించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అందుకే బాల్య వివాహాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, బాల్య వివాహాల నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిందని జవహర్ రెడ్డి సూచించారు. అందులో భాగంగా మండలాల్లో బాలికల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలను కొంతమేరకు నియంత్రించేందుకు వీలుగా వివాహ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేయాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖలతో రెండు రోజుల్లో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Andhra Pradesh : బాల్య వివాహాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

AP CS