Site icon HashtagU Telugu

AB Venkateswara Rao : జ‌గ‌న్ పై ఏబీవీ విజ‌యం

Ab Venkateswara Rao Show Cause Notice

Ab Venkateswara Rao Show Cause Notice

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు చేసిన న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఆయ‌న‌పై వేసిన స‌స్పెన్ష‌న్ వేటును జ‌గ‌న్ సర్కార్ ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించింది. మరోవైపు ఫిబ్రవరి 8 నుంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు జీతభత్యాలను ఇవ్వాలని చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదేశించారు. ఆ మేర‌కు జీఏడీ ఫైల్ ను మూవ్ చేసింది.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్స్ మేర‌కు ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ వేసి సర్వీసులోకి జ‌గ‌న్ స‌ర్కార్ అనివార్యంగా తీసుకుంది. సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసు కింద పరిగణించాలని, స‌స్పెన్ష‌న్ కాలంలోనూ జీతాన్ని చెల్లించాల‌ని సుప్రీం ఇచ్చిన తీర్పు మేర‌కు ఫైల్ త‌యారు అవుతోంది. ఇటీవ‌ల ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలను ఏబీవీ అందించారు. సర్వీసులోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆ సమయంలో ఆయనకు సీఎస్ అందబాటులోకి రాలేదు. దీంతో, ఇటీవలే రెండోసారి సీఎస్ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడూ కూడా సీఎస్ అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకోవాలని ఏబీవీ మరోసారి వినతిపత్రాన్ని సీఎస్ కార్యాలయంలో అందించారు. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.

ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండరాదు. రెండేళ్లకు మించితే సస్పెన్షన్ ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 2020 ఫిబ్రవరి 8న ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఆయ‌న్ను సస్పెండ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7తో రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తయింది. దీంతో, ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసులో ఉన్నట్టు గుర్తించాలి. ఆయనకు అందాల్సిన ప్రయోజనాలన్నింటినీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. స‌ర్వీస్ లోకి తీసుకున్న ఏబీవీని జ‌గ‌న్ స‌ర్కార్ ఏ విధంగా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.