Site icon HashtagU Telugu

AP Omicron: ఒమిక్రాన్‌ కట్టడికి వైద్య ఆరోగ్య‌శాఖ “ఐదు సూత్రాల ప్రణాళిక”

cm jagan

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. ఈ వేరియంట్ క‌ట్ట‌డికి ఐదు సూత్రాల ప్ర‌ణాళిక‌ను ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుదల చేసింది. వాటిలో 1.విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా 2. ప్రతి ఒక్కరికీ కోవిడ్‌–19 వ్యాక్సినేషన్ 3. మాస్క్‌ ధరించకపోతే జరిమానా 4. వేగవంతంగా కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు 5. ఇంటింటికి సర్వేతో వ్యాధుల గుర్తింపు

మొదటి సూత్రం..:

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఒమిక్రాన్‌ కేసులు వస్తున్న దృష్ట్యా మొట్టమొదటిగా విమానాశ్రయంలోనే వైరస్‌ బాధితులను గుర్తించి అక్కడే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన ఏడుగురు వైద్యులు, వైద్య సిబ్బంది హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24?7 విధులు నిర్వహిస్తూ విదేశాల నుంచి జిల్లాకు చెందిన వారు ఎవరైనా కనిపించగానే తక్షణమే వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసి కొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఒమిక్రాన్‌ కేసులు నమోదు ప్రారంభమైన తరువాత జిల్లాకు 1783 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. వీరందరికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసి ఒమిక్రాన్‌ లేకపోవడంతో వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండో సూత్రం..

ప్రతి ఒక్కరికి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జిల్లా జనాభాలో 96 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు.

మూడో సూత్రం..

వ్యాక్సిన్‌ వేసుకోవడంతోపాటు, మాస్క్‌ పెట్టుకుంటేనే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న జిల్లాలోని 96,675 మంది నుంచి రూ. 71,02,250లు జరిమానా వసూలు చేశారు.

నాల్గవ సూత్రం..

కోవిడ్‌–19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో వైద్య అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డిసెంబరు 12 నాటికి 1,79,080 పాజిటీవ్‌ కేసులను నిర్ధారించి వైద్య సేవలందించగా, 1,77,647 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు, మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రాంతాల్లోనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేసేలా వైద్య అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నారు.

ఐదో సూత్రం..
వైద్య అధికారులు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఎవరైనా ఇళ్లలోనే ఉంటే, వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకకుండా ఇళ్ల వద్దే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంత మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ కేసుల నమోదు దృష్ట్యా ప్రజలు ఆందోళ‌న చెందుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. వైద్య సిబ్బంది సైతం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు