Site icon HashtagU Telugu

AP Govt Orders:జ‌గ‌న్ నిర్ణ‌యం, అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ క్లోజ్

Andhra Pradesh Secretariat

Andhra Pradesh Secretariat

అచ్చుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీడ్స్ కంపెనీని తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తెరవరాదని ఆదేశించింది. మరోవైపు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. గతంలో విషవాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదానికి సీడ్స్ కంపెనీదే బాధ్యత అని, విషవాయువు లీకేజీ ఘటనలో గాయపడిన ఎన్టీఆర్‌ ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సీడ్స్ యూనిట్‌లో 121 మంది అస్వస్థతకు గురయ్యారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని ఐదు ఆస్పత్రుల్లో చేర్చామని, బాధితులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అభిప్రాయపడ్డారు. బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన తర్వాత శాంపిల్స్‌ను ఐసీఎంఆర్‌కు పంపుతున్నట్లు తెలిపారు. తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఆదేశించినట్లు తెలిపారు.