ఏపీ ప్రభుత్వం (AP Govt) తిరుమల లడ్డు (Tirumala Laddu) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ (SIT) దర్యాప్తనకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో ప్రత్యేక బృందం దర్యాప్తును నిలిపేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అక్టోబర్ 3 వరకూ దర్యాప్తు నిలిపేస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పు ఆధారంగా ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా సీట్ అధికారులు బృందాలుగా ఏర్పడి లడ్డు కల్తీ ఫై దర్యాప్తు చేపట్టారు.
కాగా లడ్డు కల్తీ ఫై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం (AP CM Chandrababu Naidu) చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది. ”ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు (Quality Tests) పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు..? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా..? నెయ్యి కల్తీ జరిగినట్లైనా ఆధారాలు చూపించండి. అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది? నెయ్యిని ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారు? అన్నింటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్ (Testing)కి పంపారా..? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా..?” అని సూటిగా ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో రాజకీయ జోక్యం (Political Interfearance)పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీట్ లడ్డు విచారణ కు బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది.
Read Also : IND vs BAN: టీమిండియా సంచలన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్!