Andhra Pradesh: అప్పుల కోసం బ్యాంకులు చెప్పినట్టే సర్కారు వారి ఆట.. షరతులు వర్తిస్తాయి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోంది.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 12:44 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోంది. దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. అదేమంటే ప్రజా సంక్షేమ పథకాల కోసమే అంటోంది. ఇప్పుడు ఎవరూ అప్పులు ఇచ్చే సీన్ లేదు. అటు కేంద్రం కూడా కన్నెర్ర చేస్తోంది. దీంతో వేరే దారి లేక బ్యాంకులు చెప్పిన నిబంధనలకు మరో మాటకు తావులేకుండ ఓకే చెప్పేసి మరీ అప్పులు తెచ్చుకుంటోంది. ఆమేరకు జనంపై భారీగా భారం మోపుతోంది. ఈమేరకు జీవోలు కూడా జారీచేస్తోంది.

ధాన్యం పై గతంలో మార్కెట్ ఫీజు ఒక శాతం ఉంటే.. ఇప్పుడు 2 శాతమైంది. రొయ్యలు, చేపల అమ్మకాలపై గతంలో మార్కెట్ ఫీజు 0.25 శాతం ఉంటే.. ఇప్పుడు దానిని ఏకంగా 1 శాతానికి పెంచడంతో అమ్మకందారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం మాత్రం దానివల్ల 400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేస్తోంది. ఇలా ఫీజును కూడా బ్యాంకు షరతులకు లోబడి పెంచారని సచివాలయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ అదనపు ఫీజును పదేళ్లకు వసూలు చేసి దానిని ప్రత్యేక నిధిగా చూపిస్తారు. దీనిద్వారా రూ.1600 కోట్ల అప్పు తీసుకోవడమే టార్గెట్. పైగా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వసూలు చేసే మార్కెట్ ఫీజుతో ఏఏ మార్కెట్ యార్డులను ఎంతెంత ఖర్చుపెట్టి డెవలప్ చేస్తారో చెబుతూ జీవో ఇచ్చింది. దీనివల్ల ఆర్బీఐతో కాని కేంద్రంతో కాని అటు బ్యాంకుకు, ప్రభత్వానికీ ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత తీసుకున్నారంటున్నారు విశ్లేషకులు.

నిజానికి జగన్ సర్కారు వచ్చిన కొత్తలో రాష్ట్రానికి అప్పులివ్వడం కోసం ఇతర బ్యాంకులతో ఒక కన్సార్షియంను ఏర్పాటు చేసింది ఎస్బీఐ. దాని ద్వారా రూ.25 వేల కోట్ల రుణాన్ని ఇప్పించింది. కానీ ఆ తరువాత ప్రభుత్వ చర్యలను గమనించి అప్పులివ్వడం ఆపేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్బీఐ ఎందుకు రుణాలు ఇవ్వడం లేదన్నదానిపై చర్చ జరిగింది.

అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనించిన కేంద్ర ఆర్థికశాఖలోని ఫైనాన్షియ్ సర్వీసెస్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ లు.. అప్పులిచ్చే విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కొన్ని గైడ్ లైన్స్ ని ఇచ్చాయి. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం.. తెలివిగా అడుగులు వేస్తోంది. మద్యం ఆదాయం రాష్ట్రానికి ఏటా రూ.25 వేల కోట్ల వరకు వస్తుంది. ఇప్పుడది సర్కారు ఖజానాలో పడకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా చక్రం తిప్పింది. ఈమేరకు ఆ మొత్తం తన బ్యాంకుకు చేరేలా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించుకుంది. చట్ట సవరణలు చేయించి, కొత్త చట్టాలు చేయించుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం పడుతున్న తిప్పలు.. ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. తరువాత వచ్చే ప్రభుత్వాలు, ప్రజల మీద పెను భారాన్ని మోపుతాయనడంలో సందేహం లేదు.