Site icon HashtagU Telugu

Million March : మ‌రో `మిలినియం మార్చ్` కు ఉద్యోగుల ప్లాన్

Ap Employess

Ap Employess

ప్ర‌భుత్వ ఉద్యోగులు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా వ్య‌వ‌హారం న‌డుస్తోంది. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దుతో పాటు ప‌లు డిమాండ్లు చేస్తూ ఉద్యోగులు చేసిన `ఛ‌లో విజ‌య‌వాడ‌` సూప‌ర్ స‌క్సెస్ అయింది. తొలిసారిగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల ఆగ్ర‌హాన్ని రుచిచూశారు. ఆ దెబ్బ‌కు డీజీపీని కూడా మార్చేశారు. ఉద్యోగ సంఘాల నాయ‌కుల మ‌ధ్య గ్యాప్ క్రియేట్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో మాత్రం ఆగ్ర‌హం నివురుగ‌ప్పిన నిప్పులా నిలిచిపోయింది.

మండేగుండెలను రాజేస్తున్న‌ట్టు కొంద‌రు ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం వేధిస్తోందట‌. షోకాజ్ నోటీసులు, స‌స్పెన్ష‌న్ల రూపంలో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని లోలోన ర‌గిలిపోతున్నారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి కొందరిలో ఇప్ప‌టికీ అసంతృప్తత నిగూఢంగా ఉంది. కానీ, బ‌య‌ట‌కు మాట్లాడేందుకు భ‌య‌ప‌డిపోతున్నారు. ఒక వేళ నోరువిప్పితే ఏమ‌వుతోంద‌న‌ని ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నార‌ని విప‌క్ష పార్టీల నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీల‌కు వాటిని అమలు చేస్తోన్న తీరుకు ఏ మాత్రం పొంత‌న లేద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నారు.

ఉద్యోగుల ఆగ్రహానికి నిద‌ర్శ‌నంగా పెద్ద ఎత్తున్న ఐదు జిల్లాల నాయకులు కార్యవర్గ సభ్యులు ర్యాలీకి శ్రీకాకుళం తరలివచ్చారు. జిల్లా కేంద్రంలో పలు సమస్యలపై వారు మాట్లాడారు. అదేవిధంగా పాఠశాలల విలీనంపై గళం వినిపించారు. సీపీఎస్ రద్దు కు సంబంధించి ఎటువంటి స్పష్టతా ఇవ్వడం లేదని మండిపడ్డారు . ఆ క్ర‌మంలో ఉద్యోగులకూ అధికార పార్టీ నాయకులకూ మధ్య దూరం పెరుగుతోంది. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఫ‌లితంగా ఉద్యమ మ‌రో రూపం దాల్చే సూచనలు ఉన్నాయ‌ని ఉద్యోగ వ‌ర్గాల్లోని కొంద‌రు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ విజ‌య‌వంతం కావ‌డంతో సెప్టెంబ‌ర్లో మిలీనియం మార్చ్ దిశ‌గా ఉద్యోగులు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.