Ticket Prices Issue: సంక్రాంతి హీరోల‌కు జ‌ల‌క్‌!

ఏపీ ప్ర‌భుత్వం దెబ్బ‌కు పెద్ద హీరోల సినిమాలు రేంజ్ త‌గ్గ‌నుంది. క‌లెక్ష‌న్ల పండుగ కోసం ఎదురుచూసిన పెద్ద హీరోల సినిమా నిర్మాత‌లు ఢీలా ప‌డుతున్నారు. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించుకోవ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు.

  • Written By:
  • Updated On - January 1, 2022 / 04:21 PM IST

ఏపీ ప్ర‌భుత్వం దెబ్బ‌కు పెద్ద హీరోల సినిమాలు రేంజ్ త‌గ్గ‌నుంది. క‌లెక్ష‌న్ల పండుగ కోసం ఎదురుచూసిన పెద్ద హీరోల సినిమా నిర్మాత‌లు ఢీలా ప‌డుతున్నారు. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించుకోవ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్ర‌కారం ఏర్ప‌డిన ప్ర‌త్యేక‌ క‌మిటీ తుది నివేదిక‌ను ఇవ్వ‌లేక పోతోంది. వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని శుక్ర‌వారం నిర్వ‌హించిన క‌మిటీ ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేక పోయింది. మ‌రోసారి జ‌న‌వ‌రి మొద‌టి వారంలో స‌మావేశం కావాల‌ని మాత్ర‌మే తీర్మానం చేసింది. జ‌న‌వ‌రి మూడో తేదీన హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కు సినిమా టిక్కెట్ నియంత్ర‌ణ ఇష్యూ రాబోతుంది. ఆ రోజున హైకోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా ఏపీ ప్ర‌భుత్వం న‌డుచునే అవ‌కాశం ఉంది. పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని త్వ‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ క‌మిటీకి ఇచ్చిన డైరెక్ష‌న్. అన్ని కోణాల నుంచి అధ్య‌య‌నం చేసిన త‌రువాత మాత్ర‌మే పార‌ద‌ర్శ‌క‌మైన నివేదిక‌ను ఇవ్వాల‌ని కోరింది. ఈ క్ర‌మంలో సంక్రాంతి బ‌రిలోని పెద్ద హీరోల సినిమాల విడుద‌ల ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉంది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ కల్యాణ్ సినిమా బీమ్లానాయ‌క్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సినిమా టిక్కెట్ల ధ‌ర నియంత్ర‌ణ‌తో విడుద‌ల నుంచి ప‌వ‌ర్ స్టార్ సినిమా వెన‌క్కు వెళ్లింది. ఉచితంగా సినిమాను ఆడిస్తానంటూ ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఆ మేర‌కు నిర్ణ‌యాన్ని తీసుకోలేక పోతున్నాడు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాను విడుద‌ల చేస్తే క‌లెక్ష‌న్లు వ‌చ్చే ఛాన్స్ లేద‌ని నిర్మాత ఆందోళ‌న చెందుతున్నాడు. ఫ‌లితంగా బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల త్రిశంకు స్వ‌ర్గంలో ప‌డిపోయింది. ఆ సినిమా సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీకి వెళ్లింది. అప్ప‌టికి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే..విడుద‌ల చేస్తారు. లేదంటే, ఆ తేదీన విడుద‌ల కూడా అనుమాన‌మే. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్ర‌యాన్ని కోరిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. టిక్కెట్ ధ‌ర నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ ప‌ద్ధ‌తిని కోరిన చిరు అండ్ టీం ఇప్పుడు మౌనంగా ఉంది. ఏపీ ప్ర‌భుత్వం చిరు అండ్ టీం చెప్పిన‌ట్టుగానే చేస్తోంది. సీఎం జ‌గ‌న్ ను క‌లిసి ఇలా ఎందుకు చేస్తున్నార‌ని అడిగే అవ‌కాశం ఆ టీంకు లేదు. టాలీవుడ్‌, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రుగుతోన్న ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధాన్ని మౌనంగా చూస్తున్నారు. త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ ను క‌లుసుకుంటాన‌న్న చిరంజీవి ఆ సాహసం కూడా చేయ‌లేక‌పోతున్నాడు. ఆయ‌న న‌టించిన ఆచార్య సినిమా విడుద‌ల ఒక ప్ర‌హ‌స‌నంగా మారింది. ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన ఆ సినిమాను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

వాస్త‌వంగా సంక్రాంతి బ‌రిలోకి ఈ సినిమా కూడా రావాలి.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు.
రెండేళ్ల‌గా త్రిబుల్ ఆర్ సినిమా విడుద‌ల కోసం ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి నిర్మించిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపిస్తుంద‌ని అంచ‌నా వేశారు. స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు హీరోలు న‌టించారు. ఆ సినిమా ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. దీంతో క‌లెక్ష‌న్లు కూడా ఆ స్థాయిలో ఉంటాయ‌ని క‌ల‌లుగ‌న్న నిర్మాత‌కు ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం గొంతులో వెల‌క్కాయ‌ప‌డిన‌ట్టు అయింది. జ‌న‌వ‌రి 7వ తేదీ ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని షెడ్యూల్ చేశారు. హైకోర్టు డివిజ‌న్ ఇచ్చే తీర్పుకు అనుగుణంగా ఈ తేదీ మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టాలీవుడ్ టాక్‌.

అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సినిమా బంగార్రాజు సినిమాను జ‌న‌వ‌రి 15వ తేదీన విడుద‌ల చేయాల‌ని షెడ్యూల్ చేశారు. జాతీయ హీరోగా పేరున్న ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 13న పండుగ రోజు విడుద‌ల కానుంది. ఆ మేర‌కు షెడ్యూల్ చేసుకున్న‌ప్ప‌టికీ త్రిబుల్ ఆర్‌, బంగార్రాజు, రాధేశ్యామ్ సినిమా ల విడుద‌ల డివిజ‌న్ బెంచ్ ఇచ్చే తీర్పు మీద ఆధార ప‌డ్డాయి. ఇంకో వైపు క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా త‌రుముకొస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ భ‌విష్య‌త్ గాల్లో దీపంలా మారింది.