Kapu Nestham: ‘కాపు’ కార్పొరేషన్ మాయాజాలం!

పావలాకు రూపాయి లెక్క అంటే ఏమిటో ఏపీలో జగన్ సర్కార్ ను అడిగితే తెలుస్తుంది.

  • Written By:
  • Updated On - March 15, 2022 / 12:08 PM IST

పావలాకు రూపాయి లెక్క అంటే ఏమిటో ఏపీలో జగన్ సర్కార్ ను అడిగితే తెలుస్తుంది. ఇచ్చిందేమో పావలా వాటా.. కానీ దానినే రూపాయి ఇచ్చినట్టుగా మ్యాజిక్ చేస్తోంది. కాపుల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధుల్లో జరుగుతున్న మాయాజాలాన్ని చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. కాపుల సంక్షేమానికి బడ్జెట్ లో ఏటా రూ.500 కేటాయిస్తోంది. గత మూడు బడ్జెట్ లలోనూ ఇదే తంతు. కానీ దానిని రూ.3000 కోట్లు ఇచ్చినట్టుగా కాకి లెక్కలు చెబుతోందన్న విమర్శలు ఉన్నాయి.

అధికారంలోకి వచ్చాక కాపుల అభివృద్ధికి ఏటా రూ.2000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తామని ఆనాడు జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు బడ్జెట్ లలో కాపు సామాజికవర్గానికి కేటాయిస్తున్న నిధులను చూస్తే.. ఆ వర్గమే నివ్వెరపోతోంది. ఎందుకంటే కాపుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకం ఏదైనా ఉందీ అంటే.. అది కాపు నేస్తం ఒక్కటే. దానికి ఏటా 500 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది. కానీ ఖర్చు మాత్రం దాదాపు రూ.490 కోట్లు వస్తోంది. కాపు కార్పొరేషన్ పేరుతో ఆ వర్గంలో పేదలకు స్వయం ఉపాధికి నిధులు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతోంది వేరే. అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలను రద్దు చేసి కాపునేస్తం ఒక్కటే ప్రారంభించి అమలు చేస్తోంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న 3.3 లక్షల మంది మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం చేస్తోంది. దీనికోసం ఏటా రూ.490 కోట్లు ఖర్చవుతున్నాయి. మరి ప్రభుత్వం కేటాయిస్తున్నానని చెప్పిన మిగిలిన రూ.1500 కోట్లు ఎక్కడ?

ప్రభుత్వం మాత్రం తాను ఏటా రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పుకోవడం కోసం.. ఇతర వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. ఈ వర్గం కోసమే ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్టుగా చూపిస్తోంది. అంటే జగనన్న చేదోడు, జగనన్న విద్యాదీవెన, పెన్షన్లు, వసతి దీవెన, అమ్మఒడి, నేతన్న నేస్తం, ఆసరా.. ఇలాంటి పథకాలనూ కాపులకోసమే అమలు చేస్తున్నట్టుగా వారి ఖాతాలో కలిపేసింది. దీంతో ఏటా వారి కోసం కేటాయిస్తామని చెప్పిన రూ.2000 కోట్ల మార్కును కూడా దాటిపోయి.. రూ.3000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు లెక్క తేలింది దీంతో కాపులే ఈ లెక్కలు చూసి విస్తుపోతున్నారు.