YS Jagan Vs Teachers : టీచ‌ర్ల‌తో జ‌గ‌న్ క‌బ`డ్డీ`!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `మ‌రో ఛాన్స్` కోసం వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 02:44 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `మ‌రో ఛాన్స్` కోసం వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. ఆ క్ర‌మంలో టీచ‌ర్లు, ఉద్యోగుల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ నుంచి దూరంగా పెట్టేలా ప్లాన్ చేశారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల్లో కీల‌కంగా ఉండే ఉపాధ్యాయుల‌ను ప‌క్క‌న పెడుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి బోధ‌నేత పనుల్లో టీచ‌ర్ల ప్ర‌మేయం లేకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా క్యాబినెట్ తీర్మానం చేసింది. కానీ, దీని వెనుక ఎన్నిక‌ల ప్ర‌క్రియ నుంచి టీచ‌ర్ల‌ను దూరంగా పెట్టే అంశ‌మే ప్ర‌ధానంగా ఉంద‌ని విప‌క్ష నేత‌లు రియాక్ట్ అవుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌చారంలోని ప్ర‌ధాన అస్త్రం సీపీఎస్ ర‌ద్దు. అధికారంలోకి వ‌చ్చిన 15 రోజుల్లో ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అందుకే, సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌న్మానం చేసి పోటీప‌డి అనుకూల నినాదాలు చేశారు. సీన్ క‌ట్ చేస్తే, సీపీఎస్ ర‌ద్దు సాధ్య‌ప‌డ‌ద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తేల్చేసింది. బదులుగా జీపీఎస్ ఇస్తామ‌ని మంత్రివ‌ర్గం ఉప‌సంఘం చెప్పింది. ఆగ్ర‌హించిన ఉద్యోగులు, టీచ‌ర్లు `ఛ‌లో విజ‌య‌వాడ‌`కు పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసులు అదుపుచేయ‌లేని విధంగా టీచ‌ర్లు, ఉద్యోగులు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి త‌మ బ‌లం ఏమిటో నిరూపించారు. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌గ‌ల‌మ‌ని హెచ్చ‌రించారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు, టీచ‌ర్ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.

ఉద్యోగులు, టీచ‌ర్ల `చ‌లో విజ‌య‌వాడ‌` విజ‌యవంతంపై స్క్రూటినీ చేసిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలుత డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ మీద వేటు వేశారు. ఆయ‌న్ను డీజీపీ ప‌ద‌వి నుంచి త‌పిస్తూ లూప్ లైన్ లోకి పంపారు. ఆయ‌న స్థానంలో సొంత సామాజిక‌వ‌ర్గం ఐపీఎస్ ను డీజీపీగా నియ‌మించుకున్నారు. ఉద్యోగ, టీచ‌ర్ల సంఘాల నేతలు కొంద‌రి మీద కేసులు పెట్టారు. మ‌ళ్లీ రోడ్ల మీద‌కు రాకుండా లీడ‌ర్ల‌ను ఏరిపారేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఫ‌లితంగా మ‌రోసారి `ఛ‌లో విజ‌య‌వాడ‌`కు పిలుపు ఇచ్చిన‌ప్ప‌టికీ ముందుకు రావానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. అంతేకాదు, పే రివిజ‌న్ క‌మిష‌న్ వేయ‌డానికి స‌సేమిరా అంటూ మంత్రి బొత్సా ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కేవ‌లం ఉద్యోగులు మాత్ర‌మే కాదు, పేద‌లు కూడా ఉన్నార‌ని ఆయ‌న ఇటీవ‌ల అన్నారు. ఉద్యోగుల కోర్కెలు ఎప్పుడూ తీర‌వంటూ చుర‌క‌లు వేశారు. కోర్టుల‌కు వెళితే ఏమ‌వుతుందో తెలుసు క‌దా..అంటూ ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ చ‌డీచ‌ప్పుడు కాకుండా ఉద్యోగులు కుక్కిన పేనులా ఉండిపోయారు. నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న ఉద్యోగులు, టీచ‌ర్ల వాల‌కాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బోధ‌నేత‌ర ప‌నుల‌కు టీచ‌ర్ల‌ను దూరంగా ఉంచుతూ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు.

ఆర్డినెన్స్ వెనుక టీచ‌ర్ల‌ను ఎన్నిక‌ల విధుల నుంచి దూరంగా ఉంచడ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. టీచర్లు నిర్వహించే బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నారని, మరి వాటి మాటేమిటని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రిని నిలదీశారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా? అంటూ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు.

టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాల నేత‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. షెడ్యూల్ ప్ర‌కారం సిల‌బ‌స్ పూర్తి చేయ‌డానికి బోధ‌నేత‌ర విధుల నుంచి టీచ‌ర్ల‌ను త‌ప్పిస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇస్తోంది. కానీ, తాజా ఆర్డినెన్స్ మాత్రం అధికార‌, ప్ర‌తిప‌క్షం మ‌ధ్య రాజ‌కీయ వార్ గా మారింది.