Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. సంకేతాలిచ్చిన సజ్జల.. ప్రభుత్వపాలన కీలక కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతోపాటు వైసీపీ కూడా ప్రచార హోరు పెంచేసరికీ ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అని ప్రజలంతా భావించారు.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 09:55 AM IST

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతోపాటు వైసీపీ కూడా ప్రచార హోరు పెంచేసరికీ ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అని ప్రజలంతా భావించారు. ఇప్పుడు వారి అంచనాలను నిజం చేసేలా ఉన్నాయి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఏడాది.. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దారుణంగా మారుతుండడంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రభుత్వం ఏ క్షణమైనా ముందస్తు రాగం అందుకోవచ్చని విశ్లేషకులు భావించారు. ఇప్పుడదే నిజమయ్యేలా ఉంది.

ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటంటూ గతంలో వ్యాఖ్యానించిన నేతలు.. ఇప్పుడు ముందస్తు ఎన్నికల దిశగా సంకేతాలు ఇవ్వడానికి కారణాలేంటి? తాము బలోపేతమవుతున్నామని సజ్జల అన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయి అన్నారు. ప్రజల ఆదరణ పెరిగిందని.. ఆ విషయాన్ని వినయంగానే చెబుతున్నామన్నారు. దీంతో చంద్రబాబుతోపాటు పార్టీలన్నీ కలిసి వచ్చినా, విడిగా వచ్చినా గెలుపు వైసీపీదే అని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

ప్రతిపక్షాలు అన్నీ గతంలోనూ కలిసే ఉన్నాయని.. పవర్ లో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసమే విడిపోయినట్టు నటిస్తారన్నారు. పవర్ లో లేనప్పుడు అంతా ఒక్కటే అన్నట్టుగా కనిపిస్తారన్నారు. వాళ్లది బలం కాదు.. వాపు మాత్రమే అన్నారు. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏమింటే.. శుక్రవారం నాడు సజ్జల, విజయసాయిరెడ్డి.. ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ భేటీలో
స్పెషల్ ఏమీ లేదంటూనే.. పార్టీ నేతలకు అందుబాటులో ఉండడానికే కలిశామన్నారు. సీఎం ఆదేశాలను పాటిస్తామన్నారు. దీంతో వీరిద్దరూ కలిసే ఉన్నారన్న సంకేతాలను పార్టీ క్యాడర్ కు పంపించాలనే ప్రత్యేక వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తోందని అర్థమవుతోంది.