ప్లాస్టిక్ అనేది నేడు మానవ జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, నిబంధనలు తీసుకొచ్చినా ప్రజలలో మార్పు రావడం లేదు. ప్రజలు ప్లాస్టిక్‌కు అలవాటు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే, ప్లాస్టిక్ నిషేధం(Plastic Ban)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన రీతిలో ఒక కొత్త కార్యాచరణను ప్రారంభించింది. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూక్తిని అనుసరించి, ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని మొదట ఏపీ సచివాలయం నుండే అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP govt) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 10 నుండి సచివాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధించనుంది. సచివాలయంలోని ఉద్యోగులందరికీ ఒక్కో స్టీల్ వాటర్ బాటిల్‌ను అందిస్తామని ప్రకటించింది. అన్ని శాఖలకు పునర్వినియోగించదగిన (Reusable) బాటిళ్లు అందిస్తామని తెలిపింది. సచివాలయానికి బయట నుండి ఎవరూ వాటర్ బాటిళ్లు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసినట్లు కనిపిస్తోంది.
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘సే నో టు ప్లాస్టిక్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఆ కార్యక్రమం పూర్తిగా కార్యరూపం దాల్చకపోవడంతో ‘సే నో టు ప్లాస్టిక్’ అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్న ఆదేశాలు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే, ప్రభుత్వం మరోసారి ప్లాస్టిక్ నిషేధానికి బలంగా శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టమవుతోంది.