తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(AP Government) ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమలతో పాటు కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో రూ.88 కోట్ల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తామని, అలాగే ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రత ప్రమాణాల్ని బలోపేతం చేసేందుకు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో ఒప్పందం కుదిరింది. రూ.20 కోట్లతో తిరుమలలో, మరో… pic.twitter.com/Dp1Rd7EcdX
— Satya Kumar Yadav (@satyakumar_y) October 8, 2024
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారం ఢిల్లీలో ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ(FSSAI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జి. కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి. హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ(FSSAI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
Fssai Lab In Tirumala
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఆహార నాణ్యత టెస్టింగ్ ల్యాబ్‌లపై భారీ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆహార పరీక్షల ప్రయోగశాలలు (Food Testing Laboratories) ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ(FSSAI) సుముఖత వ్యక్తం చేసింది. రూ. 20 కోట్లతో తిరుమలలో మరియు మరో రూ.20 కోట్లతో కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే, ఏలూరు మరియు ఒంగోలు లో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలలను (Basic Food Testing Laboratories) ఒక్కొక్కటిగా రూ. 7.5 కోట్లతో, మొత్తం రూ. 13 కోట్లతో నెలకొల్పనున్నాయి. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ (Collection and Analysis) కోసం రూ. 12 కోట్లు, మరియు ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రూ. 11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది.