Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Sada Bainama Lands

Vishaka Saradha Peetham Lands

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలంలోని కొత్తవలస సమీపంలో, రిషికొండ వద్ద 15 ఎకరాలను ఎకరాకు లక్ష రూపాయలకు శారదా పీఠానికి కేటాయించడంపై వివాదం కొనసాగుతోంది. ఈ భూమి విలువ 15 కోట్లు గా అంచనా వేయబడింది, అయితే ప్రభుత్వం ఈ భూమిని కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అనంతరం, రెవిన్యూ శాఖకు భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 225 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం 15 లక్షలకు కేటాయించడం పై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెవిన్యూ శాఖ అధికారులు పేర్కొన్న ప్రకారం, నిన్న (06-11-24) భూమిని పంచనామా చేసి, ఈరోజు (07-11-24) ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవిన్యూ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సిసోడియా ఈ సమాచారాన్ని అందజేశారు.

గత వైసీపీ ప్రభుత్వం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి విశాఖలో 15 ఎకరాలను కేవలం 15 లక్షల రూపాయలకు కేటాయించింది. ఈ భూమి విలువ సుమారు రూ. 225 కోట్లు కాగా, ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, భూమి ధర నిర్ణయించాలనే ప్రతిపాదనపై అప్పటి కలెక్టర్‌ను సంప్రదించారు. కలెక్టర్ ఆ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుని, ఎకరాకు రూ. 1.8 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు. అయితే, సీఎం జగన్ నిర్ణయంతో 15 ఎకరాలను కేవలం రూ. 15 లక్షలకే కేటాయించారు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర చర్చలకు దారితీశింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల కేటాయింపు పై విచారణ చేపట్టింది. విచారణలో, నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చబడింది. గత మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేయాలని తీర్మానించింది. అందుకు అనుగుణంగా రెవిన్యూ శాఖ తాజాగా ఈ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది.

  Last Updated: 07 Nov 2024, 05:36 PM IST