AB Venkateswara Rao : రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020-2024 మధ్య రెండు సార్లు ఏబీవీ సస్పెండ్ అయ్యారు.
2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫా ఏబీవీని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కోంటూ క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని పేర్కొంది. ఇక ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావు పై నమోదైన అభియోగాలను వెనక్కు తీసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనల విరుద్దంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కోనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అనంతరం ఆయనపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. కుమారుడి కంపెనీనీ అడ్డుపెట్టుకుని నిఘా పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ గత ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు సార్లు సస్పెన్షన్‌కు గురైన ఏబీవీ.. ఆ రెండు సార్లు తనకు జీతం ఇవ్వాలని అభ్యర్థనలు పెట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీపై గత ప్రభుత్వం రెండు సార్లు విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.