ఏపీ లో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ (AP Government )..అన్ని వర్గాల ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. తాజాగా రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ తెలిపింది. ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్-2024 (AP Farm Fund Scheme) అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఉద్యాన పంటల పండించే రైతుల కోసం దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు 50% సబ్సిడీతో రూ.75 వేలు వారి ఖాతాల్లో జమ కానుంది. ప్రధానంగా, కరువు ప్రాంతాల్లో నీటి కొరతను పరిష్కరించేందుకు, పంటల దిగుబడిని మెరుగుపరచేందుకు ఫామ్ పాండ్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఫామ్ పాండ్లను నిర్మిస్తుంది. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు కొలతలతో పాండ్లను నిర్మిస్తారు. ఇందులో జియో మెంబ్రేన్ షీట్ (500 మైక్రాన్లు) ఉపయోగించి 12 లక్షల లీటర్ల వరకూ నీటి నిల్వ చేస్తారు. వేసవిలో 2 ఎకరాల్లో 2 పంటలకు సరిపడా నీటిని అందించగల సామర్ధ్యంతో వీటిని నిర్మిస్తారు. ఇది పండ్లు, పువ్వులు, కూరగాయల పంటల దిగుబడిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ.75 వేలు (మొత్తం ఖర్చులో 50 శాతం) ఇస్తుంది. రైతు తన వాటా కింద రూ. 75 వేలు భరించాల్సి వస్తుంది.
ఈ స్కీమ్(AP Farm Fund Scheme)కు అవసరమైన పత్రాలు :
1. ల్యాండ్ టైటిల్, పాస్‌పుస్తకం
2. ఆధార్ కార్డు
3. బ్యాంక్ పాస్‌బుక్
4. దరఖాస్తు ఫారం
దరఖాస్తు ఎలా చేయాలి?
1. దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రాల నుంచి పొందాలి. మీ సేవా కేంద్రంలో దరఖాస్తును నమోదు చేసుకోవాలి.
2. దరఖాస్తు ఫారంను పూర్తి చేసి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)లో సమర్పించాలి.
3. అధికారుల ధ్రువీకరణ తరువాత చెరువులు తవ్వడం ప్రారంభించాలి.
4. జియో-మెమ్‌బ్రేన్ షీట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
5. దాన్ని ధ్రువీకరించిన తరువాత రూ.75 వేల సబ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.
Read Also : Maharashtra : రేపు సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ షిండే..!