- భూ సమస్యలకు చెక్ పెట్టిన సీఎం చంద్రబాబు
- ‘రెవెన్యూ క్లినిక్’ అనే వినూత్న వ్యవస్థ ఏర్పాటు
- రైతుల సమస్యలు బట్టి విభాగాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ‘రెవెన్యూ క్లినిక్’ అనే వినూత్న వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ఇప్పుడు ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో వీటిని ఏర్పాటు చేసి పారదర్శకమైన పాలన అందించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
రెవెన్యూ క్లినిక్‌ల పనితీరు అత్యంత శాస్త్రీయంగా ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పట్టాదారు పాస్‌పుస్తకాలు, రీ-సర్వే, ఆర్‌ఓఆర్ (Record of Rights), ఆర్‌ఓఎఫ్‌ఆర్ (Record of Forest Rights) వంటి 14 రకాల కేటగిరీలుగా విభజిస్తారు. ప్రతి సమస్యకు సంబంధించి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుదారు రాగానే వారి సమస్య ఏ విభాగానికి చెందినదో గుర్తించి, నేరుగా ఆ టేబుల్ వద్దకు పంపిస్తారు. దీనివల్ల సమయం వృధా కాకుండా, సంబంధిత విభాగపు నిపుణులు నేరుగా బాధితులతో మాట్లాడి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు.
ఈ ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా జవాబుదారీతనం పెరిగింది. ప్రతి అర్జీకి ఒక ప్రత్యేక ఆన్‌లైన్ నంబర్ కేటాయించి, ఆధార్ మరియు ఫోన్ నంబర్‌తో అనుసంధానిస్తారు. అర్జీ స్వీకరించిన వెంటనే, ఆ సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో తెలిపే ‘సర్టిఫైడ్ కాపీ’ని డిప్యూటీ కలెక్టర్ సంతకంతో దరఖాస్తుదారుకు అందిస్తారు. సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని, కుదరని పక్షంలో నిర్దిష్ట గడువును తెలియజేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇచ్చింది. చివరగా, సమస్య పరిష్కారమైన తీరుపై ఐవీఆర్‌ఎస్ (IVRS) ద్వారా నేరుగా బాధితుడి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఈ వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకున్నారు.
